● నేటి నుంచి కొనుగోలు కేంద్రాల ప్రారంభం ● గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో గురువారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఖరీఫ్ సీజన్ కొనుగోళ్లపై పీఏసీఎస్ సెక్రటరీలు, ఐకేపీ, మెప్మా కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ శాఖ అధికారులు, ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441గా మద్దతు ధర ఉందని తెలిపారు. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15408, హెచ్ఎంటీ, సోన, జైశ్రీరామ్, కేఎన్ఎం1638, కేఎన్ఎం 7715, డబ్ల్యూజీఎల్ 44 సన్నవడ్ల రకాలకు ప్రభుత్వం క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈసారి ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, పౌర సరఫరాల శాఖ మేనేజర్ గోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, సహకార అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాలతో ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఈనెల 15, 16న ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. మొదటిసారి ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ నిర్ధేశిత కేంద్రాలను సందర్శించి, ‘ఫారం–6’ను దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


