బతుకమ్మ వేడుక.. మారిన వేదిక | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ వేడుక.. మారిన వేదిక

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

రాజన్న ఆలయ విస్తరణ పనుల వేళ.. భీమేశ్వర సదన్‌లో సంబరాలు బ్రాహ్మణ సత్రం వద్ద నిమజ్జన కుండీ ఆటపాటలకు ఆటంకం లేకుండా.. రాజన్న క్షేత్రంలో మహిళల కోసం ప్రత్యేక వేదిక

వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఏడు రోజుల బతుకమ్మ వేడుకలకు, కోలాట సంబరాలకు ఈసారి నూతన వేదిక సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు, బతుకమ్మ ఆడే పట్టణ మహిళలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.

భీమేశ్వర సదన్‌లో..

మహిళల ఆటపాటలు, కోలాటాలకు ఏమాత్రం ఇబ్బందిలేకుండా ఈ ఏడాది భీమేశ్వర సదన్‌, బ్రాహ్మణ సత్రం ఆవరణలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. విశాలమైన ఈ ఆవరణలో మహిళలంతా ఒకేచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకునేలా ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు.

భారీ నిమజ్జన కుండీ నిర్మాణం

ఏటా రాజన్న సన్నిధిలో ధర్మగుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు. విస్తరణ పనులు జరుగుతున్న వేళ బతుకమ్మ వేడుకల అనంతరం నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, సునాయాసంగా జరిగేందుకు బ్రాహ్మణ సత్రం పక్కనే ఒక భారీ నిమజ్జన కుండీని నిర్మిస్తున్నారు. దీంతో మహిళలు, భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా బతుకమ్మలను ఆత్మీయంగా సాగనంపే వీలుంటుంది. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాన్ని గౌరవిస్తూ, మహిళల సౌకర్యార్థం ఈ రకమైన ముందస్తు ఏర్పాట్లు చేయడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement