సిరిసిల్ల అర్బన్: ఓటుహక్కును హరించే చర్యలను సహించేది లేదని, ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో తొలగించిన 13 కోట్ల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట గురువారం వామపక్షాలు, బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సంఘంలో పారదర్శకత లోపించిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఎనగందుల వెంకన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి కడారి రాములు, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి సోమిశెట్టి దశరథం, ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, శ్రీధర్, మంచికట్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


