పొలిటికల్‌ వార్‌ ! | - | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ వార్‌ !

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

● 30న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ● ప్రజాసమస్యలపై కేటీఆర్‌ పది పేజీల బహిరంగ లేఖ ● వీర్నపల్లి మండలంలో బీజేపీ పాదయాత్ర ● లక్ష జనసమీకరణకు కాంగ్రెస్‌ కసరత్తులు ● వెయ్యి బస్సుల ఏర్పాటు

● 30న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ● ప్రజాసమస్యలపై కేటీఆర్‌ పది పేజీల బహిరంగ లేఖ ● వీర్నపల్లి మండలంలో బీజేపీ పాదయాత్ర ● లక్ష జనసమీకరణకు కాంగ్రెస్‌ కసరత్తులు ● వెయ్యి బస్సుల ఏర్పాటు

సిరిసిల్ల: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ రాజకీయంగా చర్చకు తెరలేపింది. పొలిటికల్‌ వార్‌కు వేదికగా నిలుస్తోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కేంద్రంగా సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 30న బహిరంగ సభను ఖరారు చేశారు. లక్ష జనాభాతో నిర్వహించి రాష్ట్రస్థాయిలో వెయ్యి రోజుల ప్రజాపాలన విజయాలను ప్రకటించాలని భావిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా.. జిల్లా ఏర్పాటుకు ముందు, ఎన్నికలకు ముందు పలుమార్లు వచ్చిన రేవంత్‌రెడ్డి పదునైన మాటలతో ప్రసంగించారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా పర్యటనపై ఆసక్తి నెలకొంది. సిరిసిల్ల నియోజకవర్గంలో 27 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌ సభ రాజకీయంగా చర్చనీయామైంది. మరోవైపు బీజేపీ 9వ ప్యాకేజీని పూర్తి చేయాలని కోరుతూ సోమవారం పాదయాత్రకు సిద్ధమైంది.

● సవాల్‌గా జన సమీకరణ

జిల్లా కేంద్రంలోని మొదటి బైపాస్‌రోడ్డులో లక్ష మందితో సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల నుంచి భారీగా జనాన్ని సమీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈమేరకు వెయ్యి బస్సులను ఇప్పటికే బుక్‌ చేశారు. మరోవైపు ప్రైవేటు కార్లు, ఆటోలు, వ్యాన్లలో జనాన్ని తరలించాలని నిర్ణయించారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిపారు. మంత్రులు డి.శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఇక్కడికొచ్చి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. ప్రధానంగా స్థానిక నేతన్నలను ఎక్కువ సంఖ్యలో సభాస్థలికి రప్పించేందుకు మహిళా సంఘాలు, నేతకార్మికులు, ఆసాములు, యజమానులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఇటీవల నామినేటెడ్‌ పదవులు పొందిన సింగిల్‌విండో చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఆత్మకమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల పార్టీ నాయకులు ఎవరికి వారు జనాన్ని సమీకరించి సభను సక్సెస్‌ చేయాలని సూచిస్తున్నారు. అయితే లక్ష మందిని తరలించడం సవాల్‌గానే మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త చలో సిరిసిల్ల అంటూ తరలిరావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

● కార్మిక క్షేత్రంలో సీఎం పాదయాత్ర

బహిరంగ సభకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి పట్టణ వీధుల్లో పాదయాత్ర చేస్తారని పార్టీ నాయకులు ప్రకటించారు. కాలేజీ మైదానంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే జిల్లా స్థాయిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నేతన్నలతో కలిసి పాదయాత్రగా పాతబస్టాండు, చంద్రంపేట సర్కిల్‌ మీదుగా రగుడు బైపాస్‌రోడ్డులోని సభాస్థలికి చేరుకుంటారు. ఈ మూడు కిలోమీటర్ల పాదయాత్ర కోసం గంట సమయాన్ని అదనంగా కేటాయిస్తూ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు చేయడం విశేషం.

సీఎంకు ప్రధాన పార్టీల సవాల్‌

సీఎం సభ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు పలు సవాళ్లు విసురుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పది పేజీల బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్లకు సీఎం రావడాన్ని స్వాగతిస్తూనే నేతన్నల కష్టాలతోపాటు జిల్లాలోని పలు సమస్యలు ప్రస్తావించారు. మరో వైపు బీజేపీ కాళేశ్వరం ప్యాకేజీ–9 పూర్తి చేయాలని కోరుతూ వీర్నపల్లి మండలంలో పాదయాత్రకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ శ్రేణులు జనసమీకరణలో ఉండగా.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాసమస్యలను ఎజెండాగా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్లడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement