ఉల్లాస్‌ పరీక్షలను పరిశీలించిన డీఆర్డీవో | - | Sakshi
Sakshi News home page

ఉల్లాస్‌ పరీక్షలను పరిశీలించిన డీఆర్డీవో

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక అక్షరాస్యత పరీక్షలను ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి(డీఆర్‌డీవో) కె.లక్ష్మీనారాయణ పరిశీలించారు. మహిళలతో ఆయన మాట్లాడి వారు నేర్చుకున్న చదువు, సంతకం చేయడం, సంఖ్యల గుర్తింపుపై ఆరా తీశారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రతి మహిళా సభ్యురాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలి

సిరిసిల్ల: విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చాటి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి కోరారు. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి జయంతి సందర్భంగా పదోతరగతి, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం తరఫున పేద విద్యార్థులను ఆదుకుంటామన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల్లో రాణించాలని కోరారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ అరుణ రాఘవరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స్వరూప తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ వన్నెల మమత, మున్సిపల్‌ కౌన్సిలర్‌ జ్యోతి, నాయకులు అర్పితరెడ్డి, కూర అంజిరెడ్డి, పుర్మాని రామలింగారెడ్డి, పాతూరి మహేందర్‌రెడ్డి, పొన్నాల బాల్‌రెడ్డి, రాఘవరెడ్డి, తిరుమల్‌రెడ్డి, నల్ల నాగిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

రోడ్ల మరమ్మతు కోసం పాదయాత్ర

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని రోడ్లను మరమ్మతు చేయాలని కోరుతూ రాష్ట్ర అంబేడ్కర్‌ యువసేన అధ్యక్షుడు సామాజిక కార్యకర్త సావనపల్లి రాకేశ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఇల్లంతకుంట నుంచి జిల్లా కేంద్రానికి పాదయాత్ర చేపట్టారు. మొదటి రోజు ఇల్లంతకుంటలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి అనంతారం, రహీంఖాన్‌పేట, వెల్జీపురం వరకు పాదయాత్ర కొనసాగించారు. సోమవారం వల్లంపట్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి ఓబులాపురం మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంటుందని రాకేశ్‌ పేర్కొన్నారు. సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏనుగుల లింగారెడ్డి, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎల్‌ఎండీకి నీటి విడుదల

బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి ఆదివారం 9,300 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి వరదకాలువ ద్వారా 12,600 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నుంచి ప్యాకేజీ–10 అన్నపూర్ణకు 6,130 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 23.65 టీఎంసీలకు చేరింది.

నిండిన సింగసముద్రం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు సింగసముద్రం నిండింది. 46 ఫీట్లకు ఒక్క ఫీట్‌ మాత్రమే తక్కువగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిగా నిండి మత్తడి దూకే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement