రైతు అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

రైతు అనుమానాస్పద మృతి

Sep 10 2026 12:09 AM | Updated on Sep 10 2026 12:09 AM

తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల పట్టణం విద్యానగర్‌కు చెందిన రైతు జంగిటి శ్రీనివాస్‌(57) చింతల్‌ఠాణా శివారులోని తన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం ఉదయం పశువుల గడ్డి కోసం పొలానికి వెళ్లిన ఆయన సాయంత్రం 7 గంటలైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పక్క పొలం వారికి ఫోన్‌ చేశారు. వారు వెళ్లి చూడగా శ్రీనివాస్‌ పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. శ్రీనివాస్‌ మరణానికి గుండెపోటు కారణమా లేదా మరేదైనా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

సమగ్ర విద్యావిధానంపై శిక్షణ

సిరిసిల్లటౌన్‌: జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బుధవారం ఒక్క రోజు ఓరియంటేషన్‌ నిర్వహించారు. పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో ఎంఈవోలు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, సీసీవోలు, సీఆర్పీలకు ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌(సమగ్ర విద్యా విధానం)పై జరిగిన వర్క్‌షాప్‌లో ప్రశస్తయాప్‌, స్వచ్ఛ హరిత విద్యాలయ, ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌, హోమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించారు. జిల్లా విద్యాధికారి శ్రీరామ్‌ మొండయ్య, సెక్టోరియల్‌ ఆఫీసర్‌ పాషికంటి సతీశ్‌కుమార్‌, ఫిజియోథెరపిస్ట్‌ రాజేశ్‌, ఎంఈవోలు రామకృష్ణ, కిషన్‌, గంగారం, శ్రావణ్‌కుమార్‌, రఘుపతి, రవీందర్‌, మనోహర్‌రెడ్డి, కపిల నరేశ్‌ పాల్గొన్నారు.

చోరీ కేసులో మరో నిందితుడి అరెస్టు

గంగాధర: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగల ముఠాలోని మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. గతంలో దొంగతనానికి పాల్పడిన నిందితుల్లో ఒకరైన గజవెల్లి వంశీ బుధవారం మధురానగర్‌లో దొంగతనం చేయడానికి వచ్చి, పోలీసులకు చిక్కాడు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకొని ఇటీవల దొంగతనానికి పాల్పడిన కొండ శశికాంత్‌, సీహెచ్‌.సంతోష్‌, గజవెల్లి వంశీతో కూడిన ముఠాపై నిఘా వేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కొండ శశికాంత్‌ను ఇప్పటికే అరెస్టు చేయగా, వంశీని సైతం అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంతోష్‌ కోసం గాలిస్తున్నారు.

గంజాయి విక్రయ కేసులో ఐదేళ్ల జైలు

కరీంనగర్‌ క్రైం: గంజాయితో పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధిస్తూ కరీంనగర్‌ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి వెంకటేశ్‌ బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన జంబార్తి ఈశ్వర్‌(24) శుభకార్యాలకు డెకరేషన్‌ పనులు చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి విక్రయించి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నాడు. 2022 అక్టోబర్‌ 17న గంజాయి విక్రయించేందుకు మానకొండూర్‌ చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కిలోకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ ఎం.రాజ్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. సాక్షులను సీఎంఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేందర్‌, కోర్టు పీసీ మౌనిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డి.శరత్‌ సాక్షులను విచారించారు. ఈశ్వర్‌ నేరానికి పాల్ప డినట్లు నిర్ధారించిన న్యాయమూర్తి ఐదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధించారు.

ఒకరిపై దాడిచేసిన ముగ్గురిపై కేసు

జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద మంగళవారం రాత్రి పురాణం పవన్‌కుమార్‌పై దాడిచేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. కరీంనగర్‌ సమీపంలోని దుర్శేడ్‌కు చెందిన పురాణం పవన్‌కుమార్‌ ట్రాలీ వాహనం నడుపుతుంటాడు. మంగళవారం ఆయిల్‌ కాటన్స్‌ తీసుకుని మెట్‌పల్లి వెళ్లి తిరిగి కరీంనగర్‌ వెళ్తుండగా మంచినీళ్ల బావివద్ద గొల్లపల్లి మండలం వెంగళాపూర్‌కు చెందిన దొనకంటి నరేశ్‌, లక్ష్మీపూర్‌కు చెందిన సంతోష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి అతివేగంగా ఎందుకు వెళ్తున్నావంటూ వాహనాన్ని ఆపి దాడిచేశారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement