గంభీరావుపేట(సిరిసిల్ల): చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రొత్సహించేందుకు ఏటా జాతీయ పోషణ మాసం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు వచ్చే నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం, సమతుల ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతను వివరించడంతోపాటు చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించే చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార ప్రదర్శనలు, అవగాహన సమావేశాలు, ఆరోగ్య పరీక్షలు, పోషణపై చర్చలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. స్థానికంగా లభించే పౌష్టిక పదార్థాలతో సమతుల ఆహారం తయారు చేసుకునే విధానాలను వివరించనున్నారు.
బాల్యం కోసం.. పోషణ మాసం
చిన్నారుల ఎదుగుదలలో పోషకాహారం కీలకం. గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ అధికారులు వివరించనున్నారు. పోషకాహారంపై ప్రతీ కుటుంబంలో అవగాహన పెంపొందించడమే పోషణ మాసోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.
అంగన్‌వాడీల వివరాలు
ప్రాజెక్టులు కేంద్రాలు
2 587
జిల్లాలో లబ్ధిదారులు
ప్రాజెక్టు 7నెలల్లోపు మూడేళ్లలోపు ఆరేళ్లలోపు గర్భిణీలు బాలింతలు
సిరిసిల్ల 1930 28827 9346 2110 1886
వేములవాడ 1052 6010 4590 1176 881
సద్వినియోగం చేసుకోవాలి
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందే పోషకాహార సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన బాల్యంతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుంది. ప్రతీ కుటుంబం పోషణమాసంలో భాగస్వామ్యం కావాలి. నెల రోజులపాటు లబ్ధిదారులకు పోషకాహార ప్రాధాన్యతపై నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అవగాాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం.
– స్వరూప, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, గంభీరావుపేట


