● పీఆర్సీల జాప్యం.. ● బెనిఫిట్స్ కోసం పండుటాకుల పడిగాపులు ● ఆ‘వేదనతో’ ఉద్యోగులు రి‘టైర్డ్’
సిరిసిల్లటౌన్: వారి జీవితం మొత్తం ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించారు. ఉద్యోగ విరమణ తర్వాత శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని ఆశిస్తే ప్రభుత్వ వైఖరితో ఆందోళన చెందుతున్నారు. మూడు దశాబ్దాల శ్రమకు ఫలితం దక్కలేదన్న ఆవేదనతో కుమిలిపోతున్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రాక వృద్ధాప్యంలో అవసరాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. మూడున్నర దశాబ్దాల కష్టాన్ని ప్రభుత్వం వద్ద వివిధ రూపాల్లో పొదుపు చేసుకుంటే వాటన్నింటికీ గ్రాట్యూటీని కలిపి రావాల్సిన సొమ్ము ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఒకప్పుడు విశ్రాంత ఉద్యోగులు పొందిన బెనిఫిట్స్ మాదిరిగా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు అందడం లేదు.
అయోమయంలో 2,400 మంది పెన్షనర్లు
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారు, ఫ్యామిలీ పెన్షనర్లు మొత్తంగా 2,400 మంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతీ నెల ఒకటో తారీఖున వచ్చే పెన్షన్ డబ్బులతోనే కిరాణం, మందులు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు. పెన్షన్ డబ్బులతోనే కుటుంబాలను వెళ్లదీసే వారు చాలా మంది ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునే కొంతమంది పెన్షనర్లు తమ జీతంపై అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర సంస్థలలో రుణాలు పొంది ఉన్నారు. ప్రతీనెల మొదటి వారంలో కిస్తులు చెల్లించాల్సి ఉంటోంది. ఒక్కో నెలలో ఏదైనా కారణాలతో జీతాలు ఆలస్యంగా వస్తే రుణదాతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెన్షనర్లకు కూడా ప్రభుత్వం ఈహెచ్‌ఎస్ కార్డులు అందివ్వగా.. అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ వైద్యం చేయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్ పనిచేయకపోవడంతో పెన్షనర్లు నగదు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు. ఇందుకు రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశం ఉండగా.. నిధుల్లేక ఏళ్లుగా రావడం లేదు.
విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లు ఇవీ..


