సిరిసిల్ల అర్బన్: జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు చేశారు. రగుడు వద్ద గల కనకదుర్గ ట్రేడర్స్ రైస్‌మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 316 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కనకదుర్గ ట్రేడర్స్ మిల్లును సీజ్ చేసి, బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్వో బుచ్చిబాబు తెలిపారు. తనిఖీల్లో డీటీవో సత్యనారాయణ, రజిత తదితరులు పాల్గొన్నారు.
పట్టు రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన
తంగళ్లపల్లి: కేంద్ర సిల్క్‌బోర్డు చేపట్టిన ‘మేరా రేషమ్ మేరా అభియాన్’లో భాగంగా బుధవారం మండలంలోని మండెపల్లిలో పట్టు రైతులకు శిక్షణ నిర్వహించారు. ‘మల్బరీ తోటల ప్రాముఖ్యత – పట్టుపురుగుల పెంపకం గృహ నిర్వహణం’ అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు మల్లికార్జున, రాఘవేందర్ మాట్లాడుతూ షెడ్ల నిర్వహణ, మొక్కల మధ్య పాటించాల్సిన దూరం, కొమ్మల కత్తిరింపు(ప్రూనింగ్)పై వివరించారు. సెరీకల్చర్ అధికారి(ఎస్‌వో) జగన్, రైతులు పాల్గొన్నారు.
నిరంతరం విద్యుత్ అందించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ సూచించారు. మండలం కేంద్రంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. విద్యుత్ అధికారులతో సరఫరాపై ఆపరేషన్ సమీక్ష నిర్వహించారు. గత మూడు నెలల్లో అత్యధికంగా విద్యుత్ వినియోగం రికార్డు నమోదవుతుందని తెలిపారు. అధిక వినియోగంతో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, వీలైనంత తక్కువ అంతరాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోలార్‌ప్లాంట్ ప్రారంభం
ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో 1.6 మెగావాట్స్ సోలార్ ప్లాంటును జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రతిరోజు 6వేల నుంచి 7వేల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అశోక్, డివిజనల్ ఇంజినీర్ అంజయ్య పాల్గొన్నారు.
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ
సిరిసిల్ల: జిల్లా న్యాయస్థానాల్లో ఈనెల 12న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే బుధవారం కోరారు. రాజీ పడదగిన కేసులలో కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ చేసి రాజీ పడేలా అవగాహన కల్పించాలని సూచించారు.


