తంగళ్లపల్లి: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల యూనిఫాంలు కుట్టించే బాధ్యతను అప్పగించడం ద్వారా మహిళా సంఘాల సభ్యుల ఉపాధికి బలమైన మార్గం ఏర్పడిందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మండెపల్లిలో శ్రీ రేణుక మాత మహిళాశక్తి టైలరింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఒక మహిళ రోజూ ఎన్ని జతల దుస్తులు కుడుతున్నారు, వారికొచ్చే రాబడి ఎంత అనే వివరాలు తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తిచేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటలతో ఆదాయం
ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు నిరంతర ఆదాయం పొందవచ్చని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. మంగళవారం మండలంలోని దేశాయిపల్లిలో రైతులు కంకణాల రమేశ్, కంకణాల రాజు సాగు చేస్తున్న కూరగాయల తోటలు, పరిపల్లి మహేందర్ పొలంలో నిర్మిస్తున్న ఫార్మ్ పాండ్‌ను పరిశీలించి అభినందించారు. నీటి ఎద్దడి సమయంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయడం మంచి ఫలితాలనిస్తుందన్నారు. సర్పంచ్ గాధగోని సాగర్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, తహసీల్దార్ మురళికృష్ణ, ఎంపీడీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో శారీరక దృఢత్వం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): క్రీడలతో శారీరక దృఢత్వం కలుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి అజ్మీర రాందాస్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ హైస్కూల్‌లో మంగళవారం మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడాపోటీలను ప్రారంభించారు. మొదటి రోజు బాలికల అండర్– 14, 17 విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఎంఈవో కృష్ణహరి, ఎస్జీఎఫ్ మండల కన్వీనర్ అక్బర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
నేత్రదానం గొప్ప సామాజిక సేవ
సిరిసిల్ల: నేత్రదానం గొప్ప సామాజిక సేవ అని, మరణానంతరం మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించే గొప్ప దైవకార్యమని డీఎంహెచ్‌వో ఎంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని నెహ్రునగర్ హైస్కూల్‌లో మంగళవారం విద్యార్థులతో నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నయీమా జహా తదితరులు పాల్గొన్నారు.
రచయితలూ.. సమాజానికి వైద్యులే
సిరిసిల్ల: సమాజ హితం కోరేదే సాహిత్యమని, సాహిత్యకారులు తమ ఉత్తమ రచనలతో సమాజానికి వైద్యం చేసే వైద్యులేనని తెలంగాణ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు రచయిత డాక్టర్ గుండ్లూరి సురేంద్రబాబు అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాహిత్యంలో ఒక రోజు శిక్షణ కార్యశాలను మంగళవారం నిర్వహించారు. ప్రముఖ కథా రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్‌కుమార్ కథలు రాయడం ఎలా..! అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ సారస్వత పరిషత్ సంచాలకులు రచయిత గరిపల్లి అశోక్, ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, తెలుగు అధ్యాపకులు సామల వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.


