ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

సిరిసిల్ల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బి గీతే, కమిషన్‌ సభ్యులతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న సంక్షేమపథకాలు, అట్రాసిటీ కేసుల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చూడాలన్నారు. జిల్లాలో అట్రాసిటీ కేసుల నమోదు, చార్జ్‌షీట్‌ దాఖలు, దర్యాప్తు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులకు ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాలు తీయించాలన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యాలయాల్లో ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.

పారదర్శకంగా విచారణ

ఎస్పీ మహేశ్‌ బి గీతే మాట్లాడుతూ, జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులను పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని వివరించారు. వివిధ దశల్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం కలిగేలా చూస్తామన్నారు.

కలెక్టర్‌కు అభినందన

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సేవలను చైర్మన్‌ వెంకటయ్య అభినందించారు. కలెక్టర్‌ అందరికీ ఒకే న్యాయం చేస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారుల సేవలను అభినందించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, డీఆర్‌వో జయశ్రీ, వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement