ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ సమీపంలోని ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షాపు షట్టర్ తాళాలను పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు రూ.15వేల నగదు అపహరించుకెళ్లారు. అయితే దొంగతనం చేసిన సబ్బులు, బిస్కెట్లు ఉన్న ఓ చేతిసంచిని షాపు ముందే వదిలిపెట్టారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకటేశ్, ఎస్సై రమేష్‌గౌడ్ పరిశీలించారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాలు. రాచర్లగొల్లపల్లికి చెందిన షాపు నిర్వాహకుడు పాతూరి రాజేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి దుకాణాన్ని మూసివేసి ఇంటికెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో దొంగలు షట్టర్ తాళాలు పగులగొట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ యజమాని హోటల్ తెరిచేందుకు రాగా.. సూపర్‌మార్కెట్ షట్టర్ పగులగొట్టి ఉండడాన్ని గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


