సాహిత్య వారసత్వం
‘గునుగు పూలు’తో మొదలైన సాహితీ సేద్యం
‘కృషి శతకం’ రచించిన రిషిక
లింగన్నపేట విద్యార్థులు.. సాహిత్య సృజనకారులు
గంభీరావుపేట(సిరిసిల్ల): పాఠశాల అంటే.. పాఠ్యాంశాల బోధన.. పరీక్షల ఫలితాలే కాదు.. సృజనాత్మకంగా ఆలోచించడం.. ఆలోచనలకు అక్షరీకరించడం అని నిరూపిస్తున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట హైస్కూల్ విద్యార్థులు. పాఠ్యాంశ పుస్తకాలు చదువడమే కాదు తాము సైతం పద్యాలు రాస్తామంటున్నారు. పద్యాలే కాదు శతకాల వరకు మా ప్రయాణం అంటూ సాహిత్యసేద్యం చేస్తున్నారు. ‘బాల సాహిత్య నిలయం’గా మారిన లింగన్నపేట పాఠశాల.. సాహిత్య సృజనకారుల కార్యశాలగా పేరొందింది.
విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి రాసే స్వేచ్ఛనిస్తూ ప్రోత్సహిస్తే ఎంతటి అద్భుతాలను సృష్టించగలరో లింగన్నపేట పాఠశాల విద్యార్థులే నిదర్శనం. పాఠ్యాంశాలతోపాటు సాహిత్య సృజనకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది.
లింగన్నపేట సాహిత్య వారసత్వం అనాదిగా కొనసాగుతూనే ఉంది. 1938లోనే లింగన్నపేట నుంచి పంతం ఆంజనేయులు కవిరాసిన ‘రుక్మిణీ కళ్యాణం’ కావ్యంగా వెలువడింది. 1969లో లింగన్నపేట బడి నుంచి ‘మానేరు’ పేరుతో సంకలనం రాగా అప్పట్లో మహాకవి సినారె స్వయంగా వచ్చి ఆవిష్కరించారు. లింగన్నపేట గడిలోనే అక్షరాలు దిద్దుకున్న గరిపెల్లి అశోక్ రాసిన కవితల పుస్తకం ‘నాంది’ 1977లో ఇక్కడే ఆవిష్కరణ జరిగింది.


