పొద్దంతా గెరువు.. రాత్రంతా చినుకులు | - | Sakshi
Sakshi News home page

పొద్దంతా గెరువు.. రాత్రంతా చినుకులు

Aug 6 2026 8:20 AM | Updated on Aug 6 2026 8:20 AM

● లోటు నుంచి సాధారణ స్థాయికి వర్షాలు ● పొంగి ప్రవహిస్తున్న మానేరు, మూలవాగులు ● మధ్యమానేరులో 17 టీఎంసీలు

● లోటు నుంచి సాధారణ స్థాయికి వర్షాలు ● పొంగి ప్రవహిస్తున్న మానేరు, మూలవాగులు ● మధ్యమానేరులో 17 టీఎంసీలు
అప్రమత్తంగా ఉండాలి

సిరిసిల్ల: జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పొద్దంతా గెరువిస్తూ.. రాత్రంతా వానచినుకులు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. కరువు పరిస్థితుల నుంచి సాధారణస్థాయికి వర్షపాతం చేరుకుంది. మూడు మండలాల్లో కాస్త ఎక్కువ వర్షాలు పడ్డాయి. మానేరు, మూలవాగులు పారుతున్నాయి. వ్యవసాయ పనులు జోరందుకున్నాయి.

వీర్నపల్లిలో అత్యధికం

అత్యధికంగా వీర్నపల్లి మండలంలో 47.6 మిల్లీమీటర్ల వర్షం పడగా, అత్యల్పంగా గంభీరావుపేట మండలంలో 9 మిల్లీమీటర్లు కురిసింది. రుద్రంగిలో 10.1, చందుర్తిలో 9.6, వేములవాడ రూరల్‌లో 24.0, బోయినపల్లిలో 12.6, వేములవాడలో 37.2, సిరిసిల్లలో 24.3, కోనరావుపేటలో 29.5, ఎల్లారెడ్డిపేటలో 27.0, ముస్తాబాద్‌లో 17.7, తంగళ్లపల్లిలో 24.3, ఇల్లంతకుంటలో 34.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 23.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, వీర్నపల్లి, వేములవాడ మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైంది.

ప్రాజెక్టులకు జలకళ

బోయినపల్లి మండలం మాన్వాడ మధ్యమానేరు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 27.55 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 16.494 టీఎంసీలకు నీరు చేరింది. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ జలాశయం పూర్తి నీటి నిల్వ 3.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.489 టీఎంసీలు ఉన్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1482.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1478.38 అడుగులకు చేరింది. నాలుగు అడుగులు నిండితే ఎగువ మానేరు జలాశయం మత్తడి దూకనుంది. ఇప్పటికే కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం మత్తడి దూకుతోంది. జిల్లా వ్యాప్తంగా 656 చెరువులు ఉండగా.. ఒక్క చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు.

మత్తడి దూకుతున్న చెక్‌డ్యామ్‌లు

వేములవాడరూరల్‌/ముస్తాబాద్‌/వీర్నపల్లి : వేములవాడ రూరల్‌ మండలంలో మంగళవారం కురిసిన వర్షానికి మల్లారం చెక్‌డ్యాం మత్తడి దూకుతోంది. ముస్తాబాద్‌ మండలం గూడెంలో రైతులు వరినాట్లు వేస్తున్నారు. రామలక్ష్మణపల్లె వద్ద మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రామలక్ష్మణపల్లె, పదిర మధ్య గల కాజ్‌వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటు వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని సర్పంచ్‌ కోటగిరి ఎల్లవ్వ తెలిపారు. వీర్నపల్లి మండలం అడవిపదిరలోని ధర్మారం చెరువు మత్తడి దూకుతోంది.

గూడెంలో వరినాట్లు వేస్తున్న కూలీలు

మత్తడి దూకుతున్న అడవిపదిరలోని ధర్మారం చెరువు

గంభీరావుపేట(సిరిసిల్ల): ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూచించారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్ట్‌ను బుధవారం ఎస్పీ మహేశ్‌ బీ గీతే, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పూర్తి స్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుత 1.6 టీఎంసీల నీరు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వివరించారు. ప్రాజెక్ట్‌ పరిధిలోని రైతులు, గ్రామస్తులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి దయాకర్‌, ప్రశాంత్‌, తహసీల్దార్‌ మారుతి, సర్పంచ్‌ అర్చన ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement