● రసాభాసగా వేములవాడ మున్సిపల్ సమావేశం
వేములవాడ/వేములవాడరూరల్: పట్టణంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. శుక్రవారం చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన 36 అంశాలతో కూడిన ఎజెండా ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపాలిటీలో వాహనాల మరమ్మతుల పేరుతో ప్రతి నెల అదనపు బిల్లులు పెడుతున్నారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వాహనాలు ఉన్నప్పటికీ వాటికి మరమ్మతులు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. 853 సర్వేనంబర్‌లో నూతన బస్టాండ్ కోసం గత ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించగా దానిని గెజిట్‌లో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్, మేనేజర్ సంపత్‌రెడ్డి, వైస్‌చైర్మన్ నరాల శేఖర్ పాల్గొన్నారు.
ఇండోర్ స్టడీటూర్‌కు..
సమావేశం అనంతరం చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి పండుగకు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇండోర్ స్టడీటూర్‌కు కౌన్సిలర్లను తీసుకెళ్లాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల కౌన్సిలర్లను కలుపుకొని పట్టణాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించడమే తమ ధ్యేయమన్నారు.
నిషేధిత సర్వే నంబర్లలో
అనుమతులు ఎలా ఇస్తారు?
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ రామతీర్థపు మాధవి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో నిర్మాణా లకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. పట్టణంలో మరణ ధ్రువీకరణపత్రాల కోసం ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కౌన్సిలర్ వెంగళ అనిత మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్‌తోపాటు పురపాలకశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ కౌన్సిలర్ వంగల శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలో ఎటు చూసినా అక్రమ నిర్మాణాలే కనిపిస్తున్నాయన్నారు.


