ఆలయ పనులు ప్రణాళికతో పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆలయ పనులు ప్రణాళికతో పూర్తి చేయాలి

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

వీటీఏడీఏ పనులపై కలెక్టర్‌ సమీక్ష

ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల/వేములవాడ/వేములవాడఅర్బన్‌: వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీటీఏడీఏ) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. వేములవాడలో కొనసాగుతున్న పనులను శుక్రవారం పరిశీలించిన అనంతరం కలెక్టరేట్‌లో వీటీఏడీఏ అధికారులతో సమీక్షించారు. ప్రతీ పనికి గడువు నిర్ణయించి పూర్తి చేయాలన్నారు. శ్రీరాజరాజేశ్వర ఆలయానికి చెందిన నూతన గోశాలకు స్థలం కేటాయింపు, మిగతా పనుల పురోగతిని రెవెన్యూ, పశుసంవర్థకశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో తుది దశ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్‌, పర్యాటక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్‌ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 ఫీట్ల రహదారి విస్తరణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. రహదారి నిర్మాణం, ఇరువైపులా మురుగు కాలువ నిర్మాణం, ఇతర పనులను నిర్ధేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహచారి, పర్యాటకశాఖ ఎస్‌ఈ సరిత, పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, ఆలయ ఈఈ రాజేశ్‌, నీటి పారుదల ఈఈ దయాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేశ్‌, ఎన్పీడీసీఎల్‌ అధికారులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. నీటివనరులు ఉన్న రైతులు మినహా మిగతా వ్యవసాయ భూములు ఖాళీగా వదిలేయకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ విద్యాలయాల విద్యార్థులకు యూనిఫామ్‌ దుస్తులు నిర్ణీత గడువులోపు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా విద్యాధికారి మొండయ్య, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్‌, ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు, మిషన్‌ భగీరథ ఈఈలు అన్వర్‌, సుమలత, జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం తదితరులు ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆరుతడి పంటల సాగుపై హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన

వేములవాడ మండలం అగ్రహారం శివారులోని తెట్టకుంట, మారుపాక గ్రామాల్లోని ఎఫ్‌సీఐ గోదాముల నిర్మాణానికి స్థలాలను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ పరిశీలించారు. అనంతరం చింతాల్‌ఠాణా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ వద్ద వేములవాడ ఆర్డీవో, తహసీల్దార్‌, సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, ఆర్డీవో కుమారి, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement