చేతులు తడిపితేనే సేవలు | - | Sakshi
Sakshi News home page

చేతులు తడిపితేనే సేవలు

Mar 5 2026 7:16 AM | Updated on Mar 5 2026 7:16 AM

కనెక్షన్‌ కావాలన్నా.. ట్రాన్స్‌ఫార్మర్‌ రావాలన్నా పైసలే.. ‘సెస్‌’ ఆస్తులకు రక్షణ కరువైందని ఆవేదన ఎన్పీపీడీసీఎల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఆ‘వేదనలు’

సిరిసిల్ల: సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌)లో ఏ పని కావాలన్నా చేతులు తడపాల్సి వస్తోందని విద్యుత్‌ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఆస్తులకు రక్షణ లేదని, ఉన్న ఆస్తులను గత పాలకవర్గాలు పరాధీనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ డాక్టర్‌ దేవరాజు నాగార్జున్‌ బుధవారం బహిరంగ విచారణ చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారులు, ‘సెస్‌’ గ్రామీణ ప్రతినిధులు పాల్గొని, తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇంత నిర్లక్ష్యమా

లూజ్‌ వైర్లతో రైతులు ట్రాక్టర్‌తో దున్నేపరిస్థితి లేదని, హార్వెస్టర్లతో వరికోతలు కోసేందుకు ఇబ్బందిగా మారిందని, లూజ్‌వైర్లను సరిచేయాల్సిన ‘సెస్‌’ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు మండిపడ్డారు. విద్యుత్‌ చౌర్యం సిబ్బంది కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతూ మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను వేయాలంటే రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పవర్‌లూమ్స్‌కు విద్యుత్‌ సరఫరాలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్నారు. టీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ డాక్టర్‌ నాగార్జున్‌ మాట్లాడుతూ ‘సెస్‌’ పరిధిలో వినియోగదారులకు వీలైనంత మేరకు వేగంగా సేవలు అందించాలన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు జరుగుతాయని, కానీ స్థానిక పాలకవర్గాల స్థాయిలో చేయాల్సిన పనులు సవ్యంగా చేయాలని సూచించారు. టీఈఆర్‌సీ సభ్యులు రఘు కంచర్ల(టెక్నికల్‌), చెరుకూరి శ్రీనివాసరావు(ఫైనాన్స్‌) తదితరులు పాల్గొన్నారు.

వార్షిక నివేదికను వివరించిన ‘సెస్‌’ ఎండీ

‘సెస్‌’ ఎండీ భిక్షపతి సంస్థ వార్షిక నివేదకను, విద్యుత్‌ కొనుగోలు, పంపిణీ లెక్కలు వివరించారు. సభలో సభ్యులు చెప్పిన అంశాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘సెస్‌’ వైస్‌ చైర్మన్‌ దేవరకొండ తిరుపతి, ‘సెస్‌’ డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, మల్లుగారి రవీందర్‌రెడ్డి, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, కొట్టెపల్లి సుధాకర్‌, ఆకుల గంగారాజం, ‘సెస్‌’ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement