● ఐదు దశల్లో కార్యక్రమాలు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో 99 రోజులపాటు చేపట్టనున్న ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను అధికారులు బాధ్యతగా విజయవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’పై బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈనెల 6 నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. గ్రామసభలు, ప్రత్యేక శిబిరాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. డీఆర్డీవో గీత, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీపీవో షరీఫొద్దీన్, జిల్లా వైద్యాధికారి రజిత, హౌసింగ్ పీడీ సాజిద్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
ఐదు దశల్లో కార్యక్రమాలు
ఏప్రిల్ 2 (మొదటి దశ).. గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16 (రెండో దశ).. మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2 (మూడో దశ).. నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు, మే 22 (నాలుగో దశ).. జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్రమాలు, జూన్ 2(ఐదో దశ).. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు.
ఇసుక డీడీలపై కలెక్టర్ ఆరా
బోయినపల్లి(చొప్పదండి): మండలంలో ఇటీవల జారీ చేసిన ఇసుక అనుమతులు, డీడీలపై కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం ఆరా తీశారు. తహసీల్ ఆఫీస్‌ను తనిఖీ చేసిన సందర్భంగా ఇసుక అనుమతులకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. ఇసుక డీడీలు ఎలా ఇస్తున్నారు? ఎన్ని రోజులకోసారి ఇస్తున్నారు? అనే విషయాలను పరి శీలించారు. అనంతరం అధికారులు, సిబ్బంది హా జరు రిజిస్టర్, భూ భారతి రిజిస్ట్రేషన్ గది పరిశీలించారు. కాగా కార్యాలయానికి చెందిన ఓ అధికారి సెలవులో ఉండగా, లీవ్ లెటర్ ఇచ్చారా అనే అంశంపై పరిశీలించారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, ఆర్‌ఐ మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీలో కలెక్టర్ భోజనం
బోయినపల్లి కేజీబీవీని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. అంతకుముందు కిచెన్, వంటగది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. అని ఆరా తీశారు. ఎస్‌వో లింగవ్వ ఉన్నారు. అనంతరం బోయినపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. గర్భిణుల రిజిస్ట్రేషన్, టీకాలు, మందుల పంపిణీపై ఆరా తీశారు. వైద్యుడు కార్తీక్ ఉన్నారు.


