మట్టిబిడ్డలు.. పల్లె పాలకులు
● సర్పంచులుగా వ్యవసాయ కూలీలు ● వీర్నపల్లిలో 8 మంది మహిళా సర్పంచులు ● గ్రామాభివృద్ధిలో ముందుంటామంటున్న అతివలు
వీర్నపల్లి(సిరిసిల్ల): వారంతా మట్టిబిడ్డలు. నిన్న..మొన్నటి వరకు మనలో ఒకరు. కొందరు వ్యవసాయ కూలీలు.. మరికొందరు టెయలరింగ్ చేస్తూ కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా నిలిచారు. రిజర్వేషన్లు కలిసిరావడంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఇన్నాళ్లు కుటుంబాలను సరైన మార్గంలో నడిపామని.. ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామంటున్నారు. వీర్నపల్లి మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మహిళా సర్పంచులపై ప్రత్యేక కథనం.
పొలం నుంచి పంచాయతీకి..
వీర్నపల్లి మండలంలో 17 గ్రామాలకు 8 గ్రామపంచాయతీల్లో మహిళలే సర్పంచులుగా గెలుపొందారు. మండలంలోని శాంతినగర్, సీతారాంనాయక్‌తండా, జవహర్‌లాల్‌నాయక్‌తండా, అడవిపదిర, ఎర్రగడ్డతండా, వీర్నపల్లి, మద్దిమల్లతండా, రంగంపేట గ్రామాల సర్పంచులుగా మహిళలు విజయం సాధించారు. వీరంతా ఇన్నాళ్లు వ్యవసాయపనులు చేసిన వారే. కొందరు సొంత వ్యవసాయ భూమిలో పనికి వెళ్తే, మరికొందరు వ్యవసాయ కూలీలుగా పనిచేశారు. ఇప్పుడు వీరంతా ఆయా పల్లెల ప్రథమ పౌరులుగా ఎన్నికయ్యారు.


