హామీల అమలులో సర్పంచులు
బోయినపల్లి/ఇల్లంతకుంట/వీర్నపల్లి: నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. బోయినపల్లి మండలం కొదురుపాక సర్పంచ్ కత్తెరపాక మంజుల తాను గెలిస్తే ఆడపిల్ల పుడితే రూ.5వేలు కట్నంగా ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చారు. గ్రామానికి చెందిన ర్యాకం గౌతమి–తిరుమలేశ్ కూతురి పేరిట పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి పథకం కింద రూ.5వేలు డిపాజిట్ చేసి వారికి అందజేశారు.
ఇల్లంతకుంటలో కుక్కల తరలింపు
ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు హామీ మే రకు గ్రామంలోని కుక్కలను తరలించేందుకు అమలాపురం నుంచి ఒక టీమ్‌ను తెప్పించారు. 8 మంది గురువారం ఒక్క రోజే 121 కుక్కలను పట్టుకొని వ్యాన్‌లో తరలించారు. మూడు రోజుల్లో గ్రామంలోని మొత్తం కుక్కలను పట్టుకెళ్లాలని ఒప్పందం చేసుకుంది. గ్రామంలోని పందులను కూడా ఊరు బయటకు తరలించాలని పందుల యజమానులకు తెలిపినట్లు సర్పంచ్ రాజు పేర్కొన్నారు.
ఉచితంగా మినరల్ వాటర్
వీర్నపల్లి మండలం అడవిపదిర సర్పంచ్ గుర్రపు స్వరూప ఉచితంగా మినరల్ వాటర్‌ను గురువారం అమలు చేశారు. ఐదేళ్లపాటు ఉచితంగా అందజేస్తానని తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ పని నర్సింగం, ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పని శివరామకృష్ణ పాల్గొన్నారు.


