వృద్ధులకు రెండు పూటలా భోజనం
● గూడెంలో అన్నపూర్ణ అమ్మ ఫౌండేషన్ దాతృత్వం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆకలితో అలమటించే వృద్ధులు.. కొడుకులు ఉన్నా పట్టింపు కరువైన తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు అన్నపూర్ణ అమ్మ ఫౌండేషన్ ముందుకొచ్చింది. కొత్త సంవత్సరం వేళ ముస్తాబాద్ మండలం గూడెంలోని 30 మంది వృద్ధులకు నిత్యం రెండు పూటలా భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 11 మంది స్వశక్తి సంఘాల మహిళలు కలిసి అన్నపూర్ణ అమ్మ ఫౌండేషన్‌ను గురువారం ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్‌పర్సన్ కుర్ర సావిత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇంటింటా ప్రచారం నిర్వహించినప్పుడు ఎంతో మంది వృద్ధులు ఆకలితో అలమటించడం కనిపించిందన్నారు. అప్పుడే వారికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. నిరాధరణకు గురవుతున్న గ్రామంలోని 30 మంది వృద్ధులకు నిత్యం రెండు పూటలా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు మద్దినేని స్వరూప, అంబాటి సుజాత, పిల్లలమర్రి విజయ, బొప్ప విజయలక్ష్మి, పద్మలత, లక్ష్మి, కవిత, స్వాతి, స్వప్ప, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.


