
ప్రబలుతున్న జ్వరాలు
● జిల్లా ప్రభుత్వాస్పత్రికి పోటెత్తుతున్న జ్వర బాధితులు ● రోజులకొద్దీ ఆస్పత్రిలోనే చికిత్స ● ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్థిక దోపిడీ
సిరిసిల్లటౌన్/వేములవాడరూరల్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు దోమలు పెరగడం, నీరు కలుషితం కావడంతో డెంగీ, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు బాధితుల చొప్పున జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు వెళ్తున్న వారికి వారం, పది రోజులపాటు చికిత్స తీసుకుంటే కాని ఆరోగ్యం మెరుగవడం లేదు. ఇన్ని రోజులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో అంత మొత్తం బిల్లులు చెల్లించే పరిస్థితి లేక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారు. ఇలా వస్తున్న వారితో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జ్వరపీడితులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతం జిల్లాలో మలేరియా, టైఫాయిడ్, వైరల్, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రకి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. జిల్లాలో జ్వరాలపై గ్రౌండ్ రిపోర్టు
విజృంభిస్తున్న విషజ్వరాలు
జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. వాతావరణంలో తీవ్రమార్పులతో దోమ కాటుకు గురైన జనాలు విషజ్వరాలతో అల్లాడుతున్నారు. నీరు, ఆహారం కలుషితం, వాతావరణంలో మార్పులతో విరేచనాలు, మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ముంచుకొస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికే రోజుకు సుమారు 700 వరకు రోగులు ఓపీ సేవల కోసం పోటెత్తుతున్నారు. వారిలో విషజ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.
వేములవాడలో నిత్యం 400 మంది ఓపీ
వేములవాడ ఏరియా ఆస్పత్రిలో వారం రోజులుగా జ్వరబాధితుల సంఖ్య పెరిగిపోతుంది. రోజుకు 400 నుంచి 500 మంది వరకు ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్నారు. ఇందులో వంద మంది వరకు జ్వరాలతో బాధపడుతున్న వారే. జ్వరాలతో ఎలాంటి ప్రమాదం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య బృందం చెబుతున్నారు. బుధవారం వేములవాడ ఏరియా ఆసుపత్రికి జ్వర పీడితులు భారీగా రావడంతో హాస్పిటల్ ఆవరణ కిక్కిరిసిపోయింది. జ్వరాలు రోజుల తరబడి తగ్గకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
తీవ్ర లక్షణాలతో ఆస్పత్రికి..
సాధారణం నుంచి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాలు, కండ్లు లాగడం వంటి లక్షణాలతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. మూత్రంలో రక్తం రావడం, నాలుక నల్లబారడం, జ్వరం తగ్గకుండా ఉంటుంది. ఎన్‌ఎస్‌ఐ ఏజీ టెస్టు పాజిటివ్ వస్తే..డెంగీ మొదటి దశలో ఉందని అర్థం. ఈదశలో రెండు, మూడురోజులు జ్వరం ఉంటుంది. ఐజీహెచ్ టెస్టు పాజిటివ్ వస్తే మోడరేట్ టు సివియర్‌గా పరిగణించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డెంగీ వచ్చిందని ఆందోళన చెంది ప్రైవేట్‌కు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
చికిత్సపై కలెక్టర్ నజర్
జిల్లాలో జ్వరాల తీవ్రత దృష్ట్యా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝ వైద్యశాఖను అప్రమత్తం చేశారు. జ్వరాలు తీవ్రత అధికమైతే జిల్లా ఆస్పత్రిలో మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సిబ్బంది వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రబలుతున్న జ్వరాలు

ప్రబలుతున్న జ్వరాలు