
విలీనంలో దారిద్య్రం
విలీన గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు
చిరుజల్లులకే చిత్తడవుతున్న రహదారులు
పట్టించుకోని అధికారులు
సిరిసిల్లఅర్బన్: విలీన గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి.
పట్టించుకునే వారు లేక అంతర్గత రోడ్లు దారుణంగా మారిపోయాయి. అడుగడుగునా గుంతలతో అవస్థలు పడుతున్నారు. ధ్వంసమైన రోడ్లకు మరమ్మతు చేపట్టాలని ఆయా
గ్రామాల ప్రజలు కోరుతున్నా స్పందించే వారు కరువయ్యారు. సిరిసిల్ల
మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లో అంతర్గత రహదారుల పరిస్థితిపై కథనం..
మోకాలు లోతు గుంతలు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, జగ్గారావుపల్లి, సర్ధాపూర్, చంద్రంపేట, రగుడు, ముష్టిపల్లి, బోనాల గ్రామాల్లోని అంతర్గత రహదారులు అధ్వానంగా మారిపోయాయి. ప్రధానంగా చంద్రంపేట పరిధిలోని జ్యోతినగర్ పెట్రోల్‌బంక్ పక్కనున్న రోడ్డు గుంతలమయంగా మారింది. ఆ గుంతల్లో నీరు నిలుస్తుండడంతో లోతు గుర్తించలేక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సిరిసిల్ల–కామారెడ్డి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన ఇప్పలపల్లికి వెళ్లే రోడ్డుపై మురుగునీరు నిలిచి ఉండడంతో అటుగా వెళ్లే గ్రామస్తులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రగుడు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి వెళ్లే ప్రధాన రోడ్డు మట్టిది కావడంతో వర్షం పడితే బురదలో నుంచి కాలనీకి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దూరులోని మున్సిపల్ కార్యాలయం వెనుక కాలనీలో సీసీ రోడ్డు లేకపోవడంతో మట్టిరోడ్డుపై గుంతలు పడ్డాయి. జగ్గారావుపల్లి, మాలపల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షానికి పాడయిపోయింది. స్కూల్‌కు వెళ్లాలంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రంపేట జ్యోతినగర్‌లో వర్షానికి బురదమయమైన రోడ్డు వెంట వెళ్లాలంటే ఇటు విద్యార్థులు, అటు సాంచల సామగ్రి తీసుకుపోయే ఆటోలు రోడ్డుపై దిగబడి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా సిరిసిల్ల పట్టణ పరిధిలోని విలీన గ్రామాల్లో రోడ్లతోపాటు అంతర్గత రహదారులు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.

విలీనంలో దారిద్య్రం

విలీనంలో దారిద్య్రం