
మహిళా సమాఖ్య సేవలు ఆదర్శం
● ఆదర్శ మహిళా సమాఖ్య ప్రతినిధులను అభినందించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జాతీయస్థాయిలో అవార్డు సాధించిన ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ఆదర్శ మహిళా సమాఖ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆత్మ నిర్భర్ సంఘాతన్ అవార్డును ఈ నెల 14న కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధులు కలెక్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఇల్లంతకుంట ఆదర్శ మహిళా సమాఖ్య బ్యాంకు రుణాల అందజేత, రికవరీ, క్రమం తప్పకుండా మీటింగ్‌ల నిర్వహణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా సంఘాలు సేవలు అందించాలని సూచించారు. డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
జిల్లాలో రైతులు ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వెల్లడించారు. వ్యవసాయాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పంటల సాగుకు అణుగుణంగా ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ తెప్పిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమంతంగా ఉండాలని, మండలాలకు వచ్చే ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా సరఫరా చేయాలని ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా, ఇతర అవసరాలకు వాడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కాన్ఫరెన్స్‌లో డీఏవో అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.