
అద్దకానికి ‘ముసురు’దెబ్బ
● ఆగిన రంగుల అద్దకం ● కష్టాల్లో కాటన్ వస్త్ర పరిశ్రమ ● కార్మికుల ఉపాధికి విఘాతం
సిరిసిల్ల: వస్త్ర పరిశ్రమలో కాటన్ బట్టది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు 20 వేల మగ్గాలపై కాటన్ బట్ట ఉత్పత్తి అయ్యేది. పాలిస్టర్ వస్త్రాల రాకతో క్రమంగా కాటన్ వస్త్రాలను ఉత్పత్తి చేసే సాంచాల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం సిరిసిల్లలో మూడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న కాటన్ వస్త్రాన్ని ఇక్కడే 42 రకాల రంగుల్లో డయింగ్ చేస్తారు. రంగుల బట్టను పట్టణ శివారుల్లో ఎండలో ఆరబెడతారు. కానీ ఇప్పుడు ముసురుకున్న వర్షాలతో ఎండలు లేక అద్దకం ఆగిపోయింది. సిరిసిల్లలో ఒకప్పుడు 150 అద్దకం యూనిట్లు ఉండగా ప్రస్తుతం 30కి తగ్గిపోయాయి. కాటన్ పరిశ్రమపై ఆధార పడి వెయ్యి కుటుంబాలు బతుకుతున్నాయి. కాటన్ వస్త్రాన్ని పెటీకోట్స్(లంగాలు)గా వినియోగిస్తున్నారు. సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న కాటన్ వస్త్రాలు ఒకప్పుడు ఐదు రాష్ట్రాలకు ఎగుమతి చేసే వారు. ఇప్పుడు పోటీని తట్టుకోలేక పోతున్నారు. ఇటీవల ప్రతికూల పరిస్థితుల్లో కాటన్ వస్త్రం కష్టాలను ఎదుర్కొంటోంది.
● ఆగిన అద్దకం
సిరిసిల్లలో నిత్యం మూడు లక్షల మీటర్ల కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. రోజూ 30 అద్దకం యూనిట్లలో ఏ రోజుకు ఆ రోజూ తెల్లవారుజామున 4 గంటలకే డయింగ్ కార్మికులు చేరుకొని రంగులు అద్దుతారు. డయింగ్ అయిన బట్టను పట్టణ శివారుకు ఆటోల్లో తరలించి ఆరబెడతారు. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పని పూర్తవుతుంది. ముసురు వర్షాలతో అద్దకం ఆగిపోయి వైట్‌క్లాత్ నిల్వలు పేరుకుపోయాయి.
● పాలిస్టర్‌కు ఆర్డర్లు.. కాటన్‌కు కష్టాలు
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ‘ఇందిరా మహిళా శక్తి’ పేరిట ఏటా రెండు చీరలు అందించాలని భావిస్తోంది. ఈమేరకు సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు 4.50 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు టెస్కో అధికారులు ఇచ్చారు. కాటన్ పరిశ్రమకు ప్రభుత్వపరంగా ఎలాంటి చేయూత లేక ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరలతోపాటు లంగాలు (పెట్టీకోట్స్) బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తే కాటన్ పరిశ్రమకు ఉపాధి లభిస్తుందని కాటన్ పరిశ్రమల యజమానులు ఆశిస్తున్నారు.

అద్దకానికి ‘ముసురు’దెబ్బ

అద్దకానికి ‘ముసురు’దెబ్బ