
రోడ్డెక్కిన అన్నదాతలు
● మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు
● పొద్దంతా క్యూలైన్‌లోనే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): యూరియా కోసం రైతులు పొద్దంతా క్యూలైన్‌లోనే ఎదురుచూడాల్సిన పరిస్థితులు. తెల్లవారుజామునే గోదాంల వద్దకు వెళ్తున్న అన్నదాతలు క్యూలైన్‌లో తమ చెప్పులు, పాసుపుస్తకాలు పెట్టి అధికారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు వచ్చినా సకాలంలో పంపిణీ చేయడం లేదు. జిల్లాలో మంగళవారం ప్రతీ మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరడం కనిపించింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైటాయించారు.
● ఇల్లంతకుంట: మండల కేంద్రంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు.
● కోనరావుపేట: స్థానిక క్రాసింగ్ వద్ద రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు దిగారు.
● ముస్తాబాద్: స్థానిక గ్రోమోర్ దుకాణం వద్ద యూరియా ఇవ్వాలని రైతులు కోరగా.. అధికా రుల నుంచి ఆదేశాలు రావని సిబ్బంది తెలపడంతో ఆగ్రహించి రోడ్డెక్కారు. కొత్తబస్టాండ్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు నిరసనకు దిగారు.
● వీర్నపల్లి: మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నాయకులు ధర్నాకు దిగారు.
● రుద్రంగి: మండల కేంద్రంలో పోలీస్ బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు ఒకటే యూరియా బస్తా పంపిణీ చేశారు.
అడ్డుకున్న పోలీసులు
● చందుర్తి: యూరియా కొరతను నిరసిస్తూ ధర్నా, రాస్తారోకాకు సిద్ధమైన చందుర్తి బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు రోడ్డెక్కకుండా అడ్డుకున్నారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి డిప్యూటీ తహసీల్దార్ శ్రీలతకు వినతిపత్రం ఇచ్చారు. చందుర్తి గోదాంకు సరఫరా చేసిన 888 బస్తాల్లో 638 పంపిణీ చేశారు. గోదాంలో 250 బస్తాలుంటే బుధవారం కోసం 350 మందికి టోకెన్‌లు ఇచ్చారు. సనుగుల సింగిల్ విండోకు 900 బస్తాలను సరఫరా చేస్తామని ప్రకటించిన వ్యవసాయాధికారులు ఒక్క బస్తాను సరఫరా చేయలేదని అక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● వేములవాడరూరల్: మండలంలోని చెక్కపల్లిలో రైతులకు యూరియా అందడం లేదంటూ బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వినీతకు వినతిపత్రం అందజేశారు.

రోడ్డెక్కిన అన్నదాతలు

రోడ్డెక్కిన అన్నదాతలు