
యూరియా కొరత లేదు
● మోతాదుకు మించి వాడొద్దు ● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం
సిరిసిల్ల: జిల్లాలో యూరియా కొరత లేదని, ఒక్క రోజు అటూ.. ఇటుగా రైతులకు అందుతోందని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం మంగళవారం తెలిపారు. జిల్లాలో సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. లారీల్లో సొసైటీలకు చేరేందుకు కొద్దిగా సమయం పడుతుందని వివరించారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో కొంతమంది రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడుతూ ధర్నాలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సీజన్ మొత్తానికి 22వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటికే జిల్లాకు 12,500 టన్నుల యూరియా వచ్చిందని స్పష్టం చేశారు. ఇంకా కావాల్సిన 11,500 టన్నుల యూరియా విడతల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. యూరియా గ్రాన్యూల్స్‌కి బదులుగా, నానో యూరియా వాడాలని కోరారు.