ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏఎస్పీ విచారణ
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన అందాసు మాధురి అదే గ్రామానికి చెందిన మ్యాదరి శంకరయ్యను కులం పేరుతో దూషించిందన్న కేసులో మంగళవారం వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి విచారణ చేపట్టారు. జోగాపూర్‌కు చెందిన మాధురికి అదే గ్రామానికి చెందిన శంకరయ్యకు మధ్య రెండేళ్లుగా భూవివాదం ఉంది. మాధురి సాగుచేస్తున్న భూమిలో ప్రభుత్వ భూమి ఉందన్న నెపంతో తరచూ మహిళతో గొడవకు దిగుతున్నారని నెల రోజుల క్రితం మ్యాదరి శంకరయ్యతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మాధురి తమను దూషించిందన్న శంకరయ్య ఫిర్యాదుతో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి విచారణ చేపట్టారు. అనంతరం చందుర్తిలో వారం క్రితం మహిళ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య ఉన్నారు.


