వైన్స్‌ల సిండికేట్ దందా!
చర్యలు తీసుకుంటాం
● ధరలు పెంచి విక్రయాలు ● మద్యం వ్యాపారుల గుత్తాధిపత్యం ● ఎమ్మార్పీ కంటే అధికం
సిరిసిల్ల: జిల్లాలో మద్యం వ్యాపారులు ఒక్కటయ్యారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలు ఎమ్మార్పీ కంటే ఎక్కువగా నిర్ణయించి విక్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం వ్యాపారులు గుత్తాధిపత్యానికి తెరలేపారు. చట్టవిరుద్ధంగా మద్యం వ్యాపారులు దందా సాగిస్తున్నారు. అక్రమ సంపాదనకు దారులు వేస్తున్నారు.
ఏం జరుగుతోంది?
కోనరావుపేట మండలంలో మూడు మద్యం దుకాణాలు ఉన్నాయి. కోనరావుపేట–నిజామాబాద్ మధ్యలో ఒక్కటి, నిమ్మపల్లి వద్ద మరొకటి, మర్తనపేట వద్ద ఇంకో మద్యం షాపు ఉండగా.. ఆబ్కారీ శాఖ నిర్వహించిన టెండరు లాటరీల్లో దుకాణాలు దక్కించుకున్న వ్యక్తులు ఆ షాపులను గుడ్‌విల్ కింద భారీ మొత్తాలకు అమ్మేసుకున్నారు. ఆ షాపులను కొనుగోలు చేసిన మద్యం వ్యాపారులు లాభాలను ఆర్జించే లక్ష్యంతో మూడుషాపులను సిండికేట్ చేశారు. ఏ షాపులో మద్యం కొనుగోలు చేసినా ప్రతీ బాటిల్‌పై ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.10 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే లైసెన్స్ ఫీజులు ఎక్కువయ్యాయని, గిట్టుబాటు కావడం లేదంటున్నారు. అందుకే మూడు వైన్స్‌షాపులను సిండికేట్‌గా చేసి ధరలు పెంచి అమ్ముతున్నట్లు చెబుతున్నారు. బిల్లు మాత్రం ఎమ్మార్పీలకే ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 48 వైన్‌షాపులు ఉండగా నిత్యం రూ.1.50కోట్ల నుంచి రూ.2.50కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ అదనపు వసూళ్లు లెక్కలోకి రాకుండా వ్యాపారుల జేబుల్లోకి వెళ్తున్నాయి.
బెల్ట్‌షాపులు బేజారు?
పల్లెల్లో బెల్ట్‌షాపులు నిర్వహించడం నేరం. కానీ ఊరూరా మద్యం విక్రయించే బెల్ట్‌షాపులు ఉన్నాయి. బెల్ట్‌షాపుల నిర్వాహకులు ఒక్కో సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.100 లాభంతో విక్రయిస్తుండగా.. వైన్‌షాపుల్లోనే అధిక ధరలకు విక్రయిస్తుండడంతో బెల్ట్‌షాపుల నిర్వాహకులు బేజార్ అవుతున్నారు. ఏ మండలంలోని బెల్ట్‌షాపుల నిర్వాహకుల అక్కడి వైన్‌షాపుల నుంచే మద్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆబ్కారీ అధికారులు దాడులు చేసి పట్టుకుంటారు. దీంతో బెల్ట్‌షాపుల నిర్వాహకులు మరింత ధరలు పెంచి అమ్ముతున్నారు. అయితే ఇది వారి వ్యాపారి కి ఇబ్బందిగా మారింది. జిల్లాలో ఎప్పుడూ లేని వి ధంగా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం ధరలు పెంచి అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. సదరు మద్యం వ్యాపారులకు ధరలు పెంచి అమ్మడం సరికాదని సూచించాం. వారు పద్ధతి మార్పుకోవాలి. మద్యం వ్యాపారులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, ఎకై ్సజ్ సీఐ


