బిల్లులు రావు.. దిగులు తీరదు !
సిరిసిల్లటౌన్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా మారింది సిరిసిల్లలో కాంట్రాక్టర్ల పరిస్థితి. దాదాపు మూడేళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.కోట్లాది పనులను టెండర్ల ద్వారా దక్కించుకుని నిర్మాణాలు పూర్తి చేశారు. అధికారులు నాణ్యతను పరిశీలించి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపించారు. దీంతో సుమారు రూ.6కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఇటీవల అందించింది. ప్రతీ రోజూ కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు అందడం లేదు. కాంట్రాక్టర్ల ఎదురుచూపులపై ‘సాక్షి’ ఫోకస్.
బిల్లులపై కాలయాపన
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.10కోట్లతో సిరిసిల్లలో మూడేళ్ల క్రితం పనులు చేపట్టినట్లు సమాచారం. వీటిని హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లికి చెందిన ఐదుగురు కాంట్రాక్టర్లు పనులు పొందారు. ప్రభుత్వ పనులే కదా బిల్లులు వస్తాయని కొందరు ఆస్తులు, ఆభరణాలు తాకట్టు పెట్టి పనులు చేయించగా.. మరికొందరు అప్పు చేసి పనులు పూర్తి చేయించారు. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అధికారులు, ఆఫీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నెల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపాలిటీకి రూ.5.85కోట్లు టీయూఎఫ్‌ఐడీసీ నిధులు మున్సిపాలిటీకి చేరాయి. 22 పనులకు సంబంధించిన బిల్లులు వస్తున్నాయని నెల రోజులుగా కాంట్రాక్టర్లు గంపెడాశతో ఉంటున్నారు. జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌లపైనే వారు ఆశలు పెట్టుకున్నారు.
కొత్తపనులకు ముందుకురాని కాంట్రాక్టర్లు
పాతబిల్లులే మూడేళ్లుగా రాకపోవడంతో కొత్త పనుల కోసం టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వాయిదా వేశారు. ఇక సిరిసిల్ల మున్సిపల్ పరిఽధిలో మూడేళ్ల క్రితం రోడ్లు, వరదకాల్వలు, డ్రెయినేజీలు, కమ్యూనిటీ భవనాలు, క్రీడాస్థలాల పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం అధికారులు టెండర్లు పూర్తి చేసి పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సదరు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని 2023లో అప్పటి కమిషనర్ ఎండీ అయాజ్‌ను, 2024లో దుబ్బాక లావణ్యను, నెల క్రితం సెలవులో వెళ్లిన కమిషనర్ ఎస్.సమ్మయ్య, ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న పోసు వాణిలకు విన్నవించారు. అయినా ఇప్పటి వరకు బిల్లులు రాలేదు.
మీరు చూస్తున్న ఈ చిత్రం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం. మైదానంలో గ్రావెల్ పనులు, సీటింగ్ గ్యాలరీ, పైకా భవనం, మరుగుదొడ్లు, మూత్రశాలలు పూర్తయ్యాయి. దీనిని అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం టీయూఎఫ్‌ఐడీసీ రూ.3కోట్లు కేటాయించింది. వీటిలో రూ.కోటి వరకు బిల్లులు కాంట్రాక్టర్‌కు చెల్లించగా.. ప్రస్తుతం మరో రూ.70లక్షలు రెండో విడతగా నిధులు మంజూరయ్యాయి.
మీరు చూస్తున్న ఈ ఫొటో జిల్లా కేంద్రంలోని వెంకంపేట ఆధునిక దోభీఘాట్ నుంచి పద్మనగర్ వరకు సుమారు 1.5 కిలోమీటర్లు నిర్మించిన ప్రధాన డ్రెయినేజీ. సుమారు రూ.6కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. మూడేళ్ల క్రితమే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేశారు. గతంలో సగం నిధులు మంజూరుకాగా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం రూ.1.4కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చేరలేదు.
మూడేళ్లుగా కాంట్రాక్టర్లకు ఎదురుచూపులే
సిరిసిల్ల బల్దియాలో వింత ధోరణి
పట్టించుకోని అధికారులు
ఆందోళనలో కాంట్రాక్టర్లు
ఉన్నతాధికారులకు విన్నవిస్తాం
కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై చర్యలు తీసుకుంటాం. బిల్లుల విషయమై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తాం. నెల రోజుల క్రితం టీయూఎఫ్‌ఐడీసీ నిధులు వచ్చాయి. పట్టణ ప్రగతి పనుల బిల్లులు కూడా కొన్ని అందాయి. త్వరలోనే బిల్లులను అందజేసేందుకు కృషి చేస్తాం.
– పోసు వాణి,
ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల
బిల్లులు రావు.. దిగులు తీరదు !
బిల్లులు రావు.. దిగులు తీరదు !
బిల్లులు రావు.. దిగులు తీరదు !


