శిక్షణతో నైపుణ్యాలకు మెరుగు
● వేసవి శిక్షణ శిబిరంలో రాణిస్తున్న విద్యార్థులు ● గాలిపల్లి హైస్కూల్‌లో నెల రోజులుగా కొనసాగుతున్న శిబిరం ● ప్రోత్సహిస్తున్న గ్రామస్తులు, ఈతరం యువజన సంఘం
ఇల్లంతకుంట(మానకొండూర్): వేసవి సెలవులను వృథా చేయకుండా క్రీడల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం శిక్షణ తరగతులకు హాజరవుతూ నచ్చిన క్రీడాంశంలో శిక్షణ పొందుతున్నారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి హైస్కూల్‌లో గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో నెల రోజులగా వాలీబాల్, కబడ్డీ క్రీడల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరికి ఈతరం యువజన సంఘం తోడుగా నిలిచింది. సమ్మర్ క్యాంప్‌నకు వస్తున్న విద్యార్థులకు స్నాక్స్ అందించడంతోపాటు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గ్రామస్తుల ప్రోత్సాహంతో విద్యార్థులు క్రీడల్లో మెరికల్లా తయారవుతున్నారు.
80 మంది విద్యార్థులు
నెల రోజులుగా కొనసాగుతున్న క్రీడల వేసవి శిబిరానికి గాలిపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 80 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం వాలీబాల్, కబడ్డీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సాన బాబు, గ్రామంలోని సీనియర్ క్రీడాకారుల సలహాలు, సూచనలతో శిక్షణ తీసుకుంటున్నారు. గ్రామంలోని సీనియర్ క్రీడాకారులు శిక్షణార్థులకు క్రీడాదుస్తులు అందజేశారు.


