వస్త్ర పరిశ్రమను ప్రక్షాళన చేయాలి
సిరిసిల్లకల్చరల్: గత ప్రభుత్వ హయాంలో వస్త్ర పరిశ్రమకు వివిధ కారణాలతో విద్యుత్ సబ్సిడీ నిలిపేశారని కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. పరిశ్రమలో సంక్షోభాన్ని నివారించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిరిసిల వస్త్ర, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్‌లో కేకే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమ సంక్షోభాన్ని నివారించేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 50 శాతం విద్యుత్‌సబ్సిడీని గత బీఆర్‌ఎస్ తొలగించే ప్రయత్నం చేసిందన్నారు. అప్పటికే సెస్‌కు బకాయిపడిన రూ.32 కోట్లను ఇవ్వలేదన్నారు. పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్‌సమస్యను త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు. పరిశ్రమ బాగుపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.300 కోట్లు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, చేనేత సెల్ అధ్యక్షుడు బండారి అశోక్, బూట్ల నవీన్, వెల్దండి దేవదాస్, గుండ్లపెల్లి గౌతమ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


