
మావోల అంతం సులువు కాదు
● పౌర హక్కులను అణిచి వేయొద్దు ● కేంద్రం వైఫల్యంతోనే పహెల్గాం ఘటన ● రైతులు, కార్మికులు, స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి ● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
సిరిసిల్లటౌన్: కర్రెగుట్ట ప్రాంతంలో మావోలను అంతం చేయడం అంత సులువు కాదని, కేంద్ర ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరపాలని సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. యుద్ధం పరిష్కారం కాదని, చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ పట్టణ మహాసభలు మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కార్మికభవనంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సుంకరపెళ్లి శాంతాబాయి చేతుల మీదుగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభలో చాడ మాట్లాడారు. పహెల్గాం ఘటనకు కేంద్రప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. కార్మికుల తమ సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎలిగేటి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది సీపీఎం కార్యకర్తలు చాడ సమక్షంలో పార్టీలో చేరారు. మూడేళ్లలో అమరులైన వారికి సంతాపం ప్రకటించారు. పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి మూడేళ్లలో జరిగిన కార్యక్రమాలను నివేదించారు. మహాసభల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు, కార్యవర్గ సభ్యులు కడారి రాములు, మీసం లక్ష్మణ్, అనసూర్య, కూర రాకేష్, మంద అనిల్ పాల్గొన్నారు.