● చలి తీవ్రతతో పెరుగుతున్న గుండెపోట్లు ● జిల్లాలో రెండు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మారుతున్న జీవనశైలితో ఇటీవల జిల్లాలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉదయం పూట వివిధ పనులపై బయటకు వెళ్తున్న వారిలోనే ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. రెండు నెలల్లో జిల్లాలో 26 మంది హార్ట్‌ఎటాక్‌తో మరణించారు. వీరిలో అత్యధికులు శ్రమజీవులైన రైతులే కావడం విషాదం. జిల్లాలో గుండెపోటు మరణాలపై ప్రత్యేక కథనం.
పొలాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు
నిత్యం కాయకష్టం చేసే రైతులు సైతం గుండెపోటుకు గురవుతుండడం కలవర పెడుతుంది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా 26 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తుంది. ఎల్లారెడ్డిపేట మండలంలోనే రెండు నెలల వ్యవధిలో ఏడుగురు రైతులు హార్ట్‌ఎటాక్‌తో మరణించారు. పొలం పనులు చేస్తుండగానే గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. రాచర్లబొప్పాపూర్‌లో పొలం పనులు చేస్తూనే రైతులు కొండాపురం శ్రీనివాస్‌రెడ్డి, బత్తుల నారాయణ, మొడుసు బుచ్చిరెడ్డి, వంగ చంద్రారెడ్డి ప్రాణాలు వదిలారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి మద్దు ల భగవంతరెడ్డి, బండలింగంపల్లికి చెందిన కొండె ముత్తిరెడ్డి గుండెపోట్లతో ప్రాణాలు కోల్పోయారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలే ప్రమాదకరం
గత నెల రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు రాత్రి పూట కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదవుతుండడం కూడా ప్రమాదాలు పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్య వయస్కులు సూర్యోదయానికి ముందు, సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. చలిమంటల వద్ద కూర్చోవడం కూడా ప్రమాదకరమని చెబుతున్నారు. కట్టెలు మండుతుండగా వచ్చే పొగ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారు సూర్యోదయానికి ముందు బయటకు వెళ్లవద్దు. చాతిలో బరువుగా ఉన్నట్లు భావించినా, చేతులు లాగడం, హఠాత్తుగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చలికాలం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాకర్లు సైతం ఎండ వచ్చిన తర్వాతే వాకింగ్ చేయడం ఉత్తమం.
– ఆర్వీఎన్ వంశీకృష్ణ, జనరల్ ఫిజీషియన్


