యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
మూలవాగు మునుగుతోంది సర్వేతోనే సరిపెట్టిన అధికారులు నిలిచిపోయిన మార్కింగ్ నిర్మాణాల కూల్చివేత రాజకీయ నాయకుల అండదండలు పట్టించుకోని అధికారులు.. ఆగని పనులు
వేములవాడరూరల్: చెరువులు.. వాగులు.. కుంట లను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. వేములవాడలో మాత్రం యథేచ్ఛగా ఆక్రమణలు సాగుతున్నాయి. మూలవాగును ఆనుకునే నిర్మాణాలు వెలుస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బఫర్‌జోన్లలో నిర్మాణాలు చేపట్టవద్దంటూ చట్టం తీసుకొచ్చింది. కానీ కొన్ని నిర్మాణాలు కొనసాగుతూ..నే ఉన్నాయి.
42 నిర్మాణాలు గుర్తింపు
వేములవాడ మూలవాగు బఫర్‌జోన్‌ను ఆక్రమించుకుని వెలసిన 42 నిర్మాణాలను నాలుగేళ్ల క్రితం అధికారులు గుర్తించారు. కూల్చేందుకు సిద్ధమైనప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో నిలిచిపోయాయి. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడలో ప్రధానంగా బ్రిడ్జి నుంచి మొదటి బైపాస్, రెండో బైపాస్‌ను ఆనుకుని మూలావాగు పక్కన ఈ నిర్మాణాలు చేపట్టారు. వీటిని కూల్చివేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్, మున్సిపల్‌శాఖ అధికారులు కదిలారు. మొదటి బైపాస్‌ను ఆనుకుని ఉన్న దాదాపు 42 నిర్మాణాలకు మార్కింగ్ పెట్టారు. కొన్నింటిని తొలగించే ప్రయత్నం చేసినా రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అక్కడితోనే ఆగిపోయాయి.
ఆగని అక్రమ నిర్మాణాలు
మూలవాగు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మూలవాగు పక్కన 9 మీటర్లు వదిలి నిర్మాణాలు చేపట్టుకోవాలి. కానీ వాగును మట్టితో పూడ్చి కొందరు పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా కొందరు గృహ యజమానులు నిర్మాణాలు జరిపినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
బఫర్‌జోన్‌లో అనుమతులు ?
బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాల్లో అనుమతులు ఇవ్వరాదని నిబంధనలు ఉన్నా మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్మాణాల కోసం కొందరు మాజీ కౌన్సిలర్లు పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.
మాజీ కౌన్సిలర్లే కాంట్రాక్టర్లు!
పట్టణంలోని కొంత మంది మాజీ కౌన్సిలర్లు కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి నూతన నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో నూతనంగా నిర్మించుకునే గృహ యజమానులు మాజీ కౌన్సిలర్లకే కాంట్రాక్టు పనులు అప్పగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని వారు భావిస్తున్నట్లు తెలిసింది. కొందరు కొత్త వారికి భవన నిర్మాణ పనులు అప్పగిస్తే పలు అనుమతుల కోసం మున్సిపల్ అధికారులు కొర్రీలు పెట్టడంతో మాజీ కౌన్సిలర్లకే అప్పగిస్తున్నారు. దీంతో నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు


