మిడ్‌మానేరు అడుగంటుతోంది..
● 7.80 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం ● రెండేళ్లుగా రాని కాళేశ్వరం నీరు ● జూలై వరకు 4 టీఎంసీలు ఉండేలా ప్లాన్
మిడ్‌మానేరు ప్రాజెక్టు స్వరూపం
నీటి సామర్థ్యం : 27.55 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం : 7.80 టీఎంసీలు 2024 ఏప్రిల్ 9న ఉన్న నీరు : 7.13 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటుతోంది. కొద్ది నెలలుగా శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల లేకపోవడంతో ప్రాజెక్టులోని నీరు ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి తరలిపోయింది. ప్రాజెక్టులోకి గతేడాది జూన్ 24 నుంచి ఇప్పటి వరకు 70 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, 67 టీఎంసీలు ఔట్‌ఫ్లోగా వెళ్లిపోయింది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా.. గురువారం నాటికి 7.80 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. గేట్ల ద్వారా విడుదల చేసే అంత నీటిమట్టం ప్రాజెక్టులో లేక పోవడంతో ఎల్‌ఎండీకి రెండు రివర్ స్లూయిస్‌ల ద్వారా 2,500 క్యూసెక్కులు, కుడికాల్వకు 300 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు.
మరో ఐదు రోజులు ఆయకట్టుకు నీరు
మిడ్‌మానేరు ప్రాజెక్టు మూడు డివిజన్ల కింద సుమారు 50వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వ ద్వారా మార్చి 31 వరకే నీటి విడుదల నిలిపి వేయాల్సి ఉండగా.. రైతుల కోరిక మేరకు మరో ఐదు రోజులు పొడగించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కుడి కాల్వ ద్వారా ఇల్లంతకుంట, గన్నేరువరం, మానకొండూర్, హుస్నాబాద్ మండలాలకు నీరు అందుతోంది.
కరీంనగర్ అవసరాలకు
ఎల్‌ఎండీకి నీటి తరలింపు
ఏటా ఎల్‌ఎండీ ఆయకట్టుకు, కరీంనగర్ పట్టణ తాగునీటి అవసరాలకు మిడ్‌మానేరు నీరే పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ప్రస్తుతం రెండు రివర్ స్లూ యిస్ గేట్ల ద్వారా కొద్ది రోజులుగా ఎల్‌ఎండీలోకి 2,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు బంద్
2023 జనవరి నుంచి 2023 మార్చి వరకు కాళేశ్వరం నుంచి వరద కాల్వ మీదుగా మిడ్‌మానేరులోకి 26.70 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. గత రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు ఖాళీ అవుతూ 7.80 టీఎంసీలకు చేరింది. వీటిలో నుంచే ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి పథకానికి రోజుకు 45 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు.
జూలై 31 వరకు 4 టీఎంసీలు ఉండేలా..
మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు విడుదల చేసినా జూలై 31 వరకు 4 టీఎంసీల మేర ఉండేలా చూసుకుంటామని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఎల్‌ఎండీకి మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. ఎల్‌ఎండీకి, కుడికాల్వకు నీరు ఇచ్చాక 5.08 టీఎంసీల మేర నీరు ప్రాజెక్టులో ఉండేలా చూస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎండకు, ఇతరత్రా సుమారు టీఎంసీన్నర మేర ఆవిరి కానుందని అధికారులు వివరించారు.


