మహనీయుల అడుగుజాడల్లో నడుస్తాం
వేములవాడఅర్బన్: మహాత్మాగాంధీ, అంబేడ్కర్ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లో జైబాపు.. జైభీమ్.. జై సంవిధాన్ పాదయాత్రను శుక్రవారం తిప్పాపూర్‌లో ప్రారంభించి మాట్లాడారు. దేశ ప్రజలను విడగొట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎండకట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణనను పూర్తి చేసి దేశంలో రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లు ఆమోదింపజేసుకున్నామని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, బింగి మహేశ్, పుల్కం రాజు, నాగుల విష్ణు, ఎర్రం రాజు ఉన్నారు.


