మా కులం పేర్లు మార్చండి సారూ...
సిరిసిల్ల/వేములవాడ: ‘మా కులం పేర్లు మార్చండి సారూ.. ఎక్కడైనా చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని.. మా కులాల పేరు మార్చేలా చర్యలు తీసుకోవాలని పలు కులాల ప్రతినిధులు రాష్ట్ర బీసీ కమిషన్ ఎదుట వాపోయారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముందుగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి దర్శించుకున్నారు. అనంతరం సిరిసిల్ల లోని ఇందిరానగర్, గీతానగర్‌లలో పర్యటించారు. పలు కులాల వారితో సమావేశమయ్యారు. పిచ్చగూంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మలి కులాల వారు తమ కులాల పేర్లను మార్చాలని కమిషన్ సభ్యులకు విన్నవించారు. తమ్మల కులానికి శూద్ర, నాన్ బ్రాహ్మణ్ పేరిట కులం సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆలయాల్లో అర్చక, ఇతర ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. తమకు తమ్మల పేరిట కులం సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. దొమ్మరి కులం పేరును సర్టిఫికెట్‌లో గాడే వంశీయులుగా మార్చాలని కోరారు. వారి ఉపాధి మార్గాలు, ఆదాయం, విద్యాస్థితిపై కమిషన్ చైర్మన్ ఆరా తీశారు. కులం పేరు దొమ్మరి ఉండడంతో విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో అవమానానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఇందిరానగర్‌లోని పిచ్చగూంట్ల(వంశరాజ్) పలువురు ఇండ్లలోకి వెళ్లి మాట్లాడారు. వారు చేస్తున్న పని, ఆదాయం తదితర వివరాలు తెలుసుకున్నారు. తమ కులస్తులవి 46 ఇండ్లు ఉన్నాయని, పిచ్చగూంట్ల అని చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పూరిండ్లలో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కమిషన్ చైర్మన్ నిరంజన్ అధికారులను ఆదేశించారు. మురికి నీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సూచించారు.
బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ప్రాధాన్యం ఇవ్వాలి
బీసీ రిజర్వేషన్ ఫలాలు ఇప్పటి వరకు వర్తించని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కులం పేరిట ఇబ్బంది పడుతున్నవారు ఆత్మన్యూనత భావానికి గురికావద్దని, పిల్లలను చదివించాలని తెలిపారు. రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పరిష్కరించేందుకు జిల్లాలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాభాయ్, తహసీల్దార్ మహేశ్‌కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజమనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు.
సమాజంలో అవమానానికి గురవుతున్నాం
బీసీ కమిషన్ చైర్మన్ ఎదుట పలు కులాల ప్రతినిధుల ఆవేదన


