తొలిసారి ఎన్నికల బరిలోకి పొదిలి.. 15 ఏళ్ల తర్వాత కందుకూరు రెండు పట్టణాల్లో అధికార పార్టీకి అభ్యర్థుల ఎంపిక సెగలు కందుకూరులో చైర్మన్ టికెట్‌పై టీడీపీలో అసమ్మతి రగడ పొదిలిలో జనసేనకు వార్డుల కేటాయింపుపై టీడీపీ నేతల తిరుగుబాటు పంచాయతీలకు రెండోదశ ఎన్నికలకు మోగిన నగారా
కూటమిలో
తొలిసారి పురపోరు సాగుతున్న పట్టణం ఒకటి.. 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతున్న పట్టణం మరొకటి.. ఎన్నికలు జరుగుతున్న కందుకూరు, పొదిలి పట్టణాల్లో ఎన్నికల వేడి రగులుతోంది. చైర్మన్ కుర్చీ కోసం నేతలు కత్తులు దూస్తుండగా.. టికెట్ల చిచ్చు
అధికార టీడీపీని కుదిపేస్తోంది.
అసమ్మతి సెగలతో కూటమి ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. ప్రజా మద్దతే అస్త్రంగా వైఎస్సార్ సీపీ పట్టణపోరుకు సై అంటోంది. పల్లెపోరులో సైతం అధికార పార్టీ
కుయుక్తులకు తెరతీసింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పురపోరుకు ముందే కూటమిలో కుంపట్లు రాజుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక.. చైర్మన్ టికెట్.. వార్డుల పంపకం.. ఇలా అధికార పార్టీ నిర్ణయాలు అసమ్మతికి ఆజ్యం పోస్తున్నాయి. కందుకూరులో చైర్మన్ అభ్యర్థి ఎంపిక టీడీపీలో చిచ్చు రేపగా.. పొదిలిలో జనసేనకు వార్డుల కేటాయింపు తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తిని బహిర్గతం చేసింది. టికెట్లు దక్కని నేతలు.. పొత్తుల నిర్ణయాలను జీర్ణించుకోలేని నాయకులు బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మరోవైపు రెండున్నరేళ్లుగా ప్రజల పక్షాన నిలిచి పోరాడిన వైఎస్సార్ సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే విజయం తమదేనన్న ధీమాతో బరిలోకి దిగుతోంది. ఈ పరిణామాలు పురపోరులో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం చేకూరుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
కందుకూరులో చైర్మన్ చిచ్చు..!
దాదాపు 15 ఏళ్ల తర్వాత కందుకూరు మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికల కంటే ముందే టీడీపీలో చైర్మన్ అభ్యర్థి ఎంపిక రగడ మొదలైంది. పిడికిటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సతీమణి దివి సౌభాగ్యలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు కండ్రా మాల్యాద్రి చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అభ్యర్థిత్వ పరిశీలనకు ఎన్నికల ఖర్చుల కింద ఒక్కొక్కరి నుంచి భారీ ఎత్తున నగదు డిపాజిట్ వసూలు చేశారని, చివరకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని చైర్మన్‌కు పోటీపడిన నేతలు మండిపడుతున్నారు. పిడికిటి వెంకటేశ్వర్లును చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో మిగిలిన ఆశావహులకు మొండిచేయి ఎదురైంది. అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న దివి సౌభాగ్యలక్ష్మి ఇప్పటికే చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం టీడీపీలో కలకలం రేపుతోంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఆమె బరిలో నిలుస్తారా.. నామినేషన్ ఉపసంహరించుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది. టికెట్ ఆశించి భంగపడిన మిగిలిన నేతలు పిడికిటి వెంకటేశ్వర్లుకు సహకరిస్తారా లేదా అన్నదీ ప్రశ్నార్థకమే. ఇదిలా ఉండగా వార్డుల్లో సైతం ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో బీఫాం దక్కని వారు రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు వైఎస్సార్ సీపీ అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడంతోపాటు చైర్మన్ అభ్యర్థిత్వంపై స్పష్టతతో ముందుకు సాగుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వార్డుల దగ్గర నుంచి చైర్మన్ టికెట్ల కేటాయింపుల వరకూ స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుని పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ప్రజల మద్దతుతో ముందుకు వెళ్దామని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
పొదిలిలో పొత్తుల పంచాయితీ..!
తొలిసారి నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పొదిలిలో కూటమి సీట్ల పంపకం వివాదాస్పదమైంది. పొత్తులో భాగంగా జనసేనకు రెండు వార్డులు కేటాయించడంపై ఆయా వార్డుల టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక వార్డులో జనసేన అభ్యర్థితోపాటు టీడీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. కూటమి నిర్ణయాలను కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తుండటంతో స్థానికంగా రాజకీయ వేడి పెరిగింది. ఈ విభేదాలు ఓట్ల బదిలీపై ప్రభావం చూపి కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సైతం పక్కా ప్రణాళికతో పురపోరుకు సిద్ధమవుతున్నారు.
పల్లెల్లో సందడి..
ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా పల్లెలో రాజకీయ సందడి మొదలైంది. మొత్తం 924 పంచాయతీలు ఉన్నాయి. 18.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచ్ పదవులకు అన్ని రాజకీయ పక్షాల మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. 18న నామినేషన్ల పరిశీలన, 19న తిరస్కరణపై అప్పీల్‌కు అవకాశం. 20న అప్పీల్‌కు పరిష్కారం, 21వ తేదీ మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన. 26వ తేదీన పోలింగ్, అదే రోజులు ఫలితాలు ప్రకటిస్తారు. తొలివిడతలో ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలోని 180 పంచాయతీలు, మార్కాపురం జిల్లాలో 135 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 15,16 తేదీలలో 139 పంచాయతీలలో సర్పంచ్ పదవులకు 502, వార్డు మెంబర్లకు 1590 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా పొన్నలూరు మండలంలో 69, మర్రిపూడి మండలంలో 65 సర్పంచ్ పదవులకు నామినేషన్లు వచ్చాయి. వార్డు మెంబర్లకు సంబంధించి టంగుటూరు మండలంలో 298 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండో విడతకు సంబంధించి ప్రకాశం జిల్లాలో 198, మార్కాపురం జిల్లాలో 95 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతకు నవంబర్ 18వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21వ తేదీ నామినేషన్ల పరిశీలన, 22 అప్పీళ్లు, పరిష్కరణ ఉంటుంది. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. 29వ తేదీన పోలింగ్ అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది.


