టీడీపీ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికార పార్టీ నేతల వెంట హల్‌చల్ వినికిడి లోపం సాకుతో పోలింగ్ విధులకు దూరం దివ్యాంగ ధ్రువీకరణ పత్రంపై అనుమానాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఒకవైపు వినికిడి లోపం ఉందంటూ ఎన్నికల విధులకు దూరం.. మరోవైపు రాజకీయ కార్యక్రమాల దగ్గరకు వచ్చేసరికి ఆ సమస్యే మాయమవుతోంది. కందుకూరులో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వ్యవహారశైలి ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికార పార్టీ నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజకీయ కార్యక్రమాల్లో బహిరంగంగా కనిపించడం విమర్శలకు తావిస్తోంది. కందుకూరు పట్టణంలోని వెంకటాద్రిపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న తల్లపనేని శ్రీనివాసరావు సోమవారం టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పిడికిటి వెంకటేశ్వర్లుతోపాటు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. పాఠశాలలకు సెలవు లేకపోయినా విధులకు హాజరుకాకుండా రాజకీయ ర్యాలీలో పాల్గొనడం, ఫొటోలకు ఫోజులివ్వడం చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు బహిరంగంగా మద్దతు పలకడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీనివాసరావు వినికిడి లోపం ఉందంటూ పొందిన ధ్రువీకరణ పత్రం చుట్టూ మరో వివాదం నడుస్తోంది. ఈ సర్టిఫికెట్‌ను ఉపయోగించుకుని బదిలీలు, పదోన్నతుల్లో ప్రయోజనాలు పొందుతున్నారని, పోలింగ్ విధులు కేటాయించకుండా మినహాయింపు పొందుతున్నారని ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆయనకు వాస్తవంగా వినికిడి సమస్య ఉందా? ధ్రువీకరణ పత్రం నిబంధనల ప్రకారమే జారీ అయిందా? అన్న అంశాలపై అధికారుల విచారణ అవసరమనే డిమాండ్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా సదరు హెచ్‌ఎం తనకు ఎమ్మెల్యే, మంత్రి తెలుసంటూ విద్యాశాఖాధికారులపై ఒత్తిడి తెస్తూ.. ఎన్నికల విధుల కేటాయింపులు, మినహాయింపుల్లో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలూ ఉన్నాయి.


