● జిల్లా ఎన్నికల నోడల్ అధికారి వెంకటేశ్వరరావు
ఒంగోలు సబర్బన్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల నోడల్ అధికారి ఎం వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లోని పలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా బారికేడ్ల ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఉలిచి, కరవది గ్రామ పంచాయతీల్లో కార్యాలయాలు, ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లను పరిశీలించారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీటీవీ నిఘా, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్ల పరిశీలన, నామినేషన్ల దాఖలు ప్రక్రియ, సంబంధిత పత్రాలను పరిశీలించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా 70వ ఎస్జీఎఫ్ బాస్కెట్‌బాల్ అండర్– 14, 17 బాల, బాలికల ఎంపికలు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. ఈ ఎంపికలను మండల విద్యాశాఖాధికారులు ఎంఎన్కే.శర్మ, కె.సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.రమణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీలు ఎం.రాజ్యలక్ష్మి, పి.శివశంకర్‌లు ప్రారంభించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల నలుమూలల నుంచి సుమారు 200 మంది బాల, బాలికలు ఎంపికలకు హాజరయ్యారు. ఈ ఎంపికల్లో ఎంపికై న అండర్–17 జట్లు ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. అదే విధంగా అండర్–14 జట్లు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా మాటేరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారులు మాట్లాడుతూ క్రీడాకారులు మంచి నైపుణ్యంతో రాణించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం మాజీ రాష్ట్ర సెక్రటరీ వై.సీనయ్య, జిల్లా అధ్యక్షుడు ఎన్.చిరంజీవిరెడ్డి, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ టి.సుబ్బారావు, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ చిత్తారు వెంకటేశ్వర్లు, రాంబాబు, వ్యాయామోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ఎం.నరసింహం పాల్గొన్నారు.
గిద్దలూరు రూరల్: మండలంలోని ముండ్లపాడులో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నంద్యాల తిరుపతమ్మ హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుల వద్దకు వారం రోజుల క్రితం వెళ్లింది. గుర్తుతెలియని దుండగులు ఇంటికి తాళాలు వేసినట్లు గమనించి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి అందులోని రూ.3వేల నగదు, జత బంగారు కమ్మలను అపహరించుకుని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇంటి తలుపులు తీసి ఉండటం గమనించిన స్థానికులు తిరుపతమ్మకు ఫోన్లో సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


