ఒకే ప్రధాన వీధికి చెరోవైపున్న రెండు గ్రామాలు వేర్వేరు జిల్లాల్లో.. ఒక గ్రామానికి 26న ఎన్నిక, రెండో గ్రామానికి 29న ఎన్నిక
బల్లికురవ:
కొత్త వ్యక్తులు ఆ ఊరి ప్రధాన వీధిలో అడుగుపెట్టగానే, ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఉన్నామో అంత చిక్కదు. మండపం ప్రధాన వీధి రెండు గ్రామాలకు సరిహద్దు. ఈ వీధికి ఉత్తరం వైపు ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలంలోని కొణిదెన రాజుపాలెం గ్రామం ఉంది. దక్షిణం వైపు బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం ఉంది. బల్లికురవ మండలంలోని రాజుపాలెంలో 927 మంది ఓటర్లు ఉన్నారు. మార్టూరు మండలం రాజుపాలెంలో 2470 మంది ఓటర్లు ఉన్నారు. లోగడ రెండూ ప్రకాశం జిల్లాలోనే ఉండేవి. మార్టూరు బాపట్ల జిల్లాలోకి చేర్చడంతో ఇక్కడ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు ఆరంభమయ్యాయి. భౌగోళికంగా మండల సరిహద్దులు ఉన్న, రెండు గ్రామాల ప్రజలు నిత్యంకలిసి మెలిసి ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వీరికి రెండు గ్రామాలు రెండు జిల్లాల్లో ఉన్నాయని గుర్తుకు వస్తాయి.
జనరల్‌కు రిజర్వ్‌తో ఆసక్తికరమైన పోటీ...
కే రాజుపాలెం జనరల్‌కు, రాజుపాలెం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఈ దఫా రెండు గ్రామాల్లో పోటీ ఆసక్తికరంగానే ఉంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. కే రాజుపాలెం గ్రామానికి చెందిన పొలాలు చీరాల రెవెన్యూ డివిజన్ లో చేరి ఉండటంతో, వివిధ పనుల నిమిత్తం అక్కడికే వెళ్లాల్సి వస్తుందని రైతులు తెలిపారు. 2021లో బల్లికురవ మండలంలోని కే రాజుపాలెం జనరల్ మహిళకు రిజర్వు కాగా రామాలయం నిర్మాణం పేరిట రూ.14 లక్షలతో ఏకగ్రీవం చేశారు. ఈ దఫా కూడా గ్రామాభివృద్ధిలో భాగంగా ఏకగ్రీవం చేయాలని కొందరు పెద్దలు భావిస్తున్నారు.


