తుఫాన్ వచ్చి పది రోజులైనా తొలగని విద్యుత్, తాగునీటి కష్టాలు విద్యుత్ పునరుద్ధరించి..పంట నష్టపరిహారం ఇవ్వండి కలెక్టర్ పి.రాజాబాబుకు విన్నవించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున
ఒంగోలు సబర్బన్: మురసు తుఫాన్ కారణంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో జరిగిన నష్టంపై తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున కోరారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ పి.రాజాబాబుకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ తాగునీరు లేక గ్రామాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేక చీకట్లో మగ్గుతున్నారని చెప్పారు. తుఫాన్ వచ్చి దాదాపు 10 రోజులు గడిచినా కొన్ని గ్రామాల్లో ఇంకా విద్యుత్ లేదని, వైర్లు, స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. తక్షణమే విద్యుత్‌ను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా రైతులకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు రైతుల పొగాకు బ్యారన్‌లు దెబ్బతిన్నాయన్నారు. గిడ్డంగులు ధ్వంసమయ్యాయి, సాగులో ఉన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని వివరించారు. పేదల గుడిసెలు, నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ముఖ్యంగా నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు, మద్దిరాలపాడు, ముప్పాళ్ల, తిమ్మసముద్రం తదితర గ్రామాల్లో కొన్నిచోట్ల ప్రైవేటు వ్యక్తుల ట్యాంకర్లపై తాగునీటి కోసం ఆధారపడాల్సి వస్తోందన్నారు. ప్రభావిత గ్రామాల్లో అధికారులతో తక్షణ క్షేత్రస్థాయి పరిశీలన, సహాయక చర్యలు చేపట్టడంతో పాటు, దెబ్బతిన్న పొగాకు బ్యారన్‌లు, గిడ్డంగులు, పంటల నష్టంపై గ్రామాలవారీగా సమగ్ర ఎన్యుమరేషన్ చేయించాలన్నారు. రైతులకు, అర్హులైన కౌలు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వెంటనే మరమ్మతు చేయాలన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ పూర్తిగా పునరుద్ధరణ, తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సురక్షిత తాగునీరు, శాశ్వత సరఫరా వ్యవస్థ పునరుద్ధరణ చేయాలని కోరారు. ఇళ్లు, గుడిసెలు దెబ్బతిన్న పేద కుటుంబాలను గుర్తించి తక్షణ ఆర్థిక సహాయం, ఆహారం, నిత్యావసర వస్తువులు, నష్ట అంచనా, చేపట్టిన చర్యలు, పరిహారం మంజూరు పురోగతిపై మండలవారీగా స్పష్టమైన సమాచారం ప్రకటించాలని కలెక్టర్‌ను కోరారు.


