ప్రతి వార్డు మెంబర్, ప్రతి సర్పంచ్ పదవికి వైఎస్సార్ సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయాలి అధికార పార్టీ నాయకులు, అధికారుల దుర్మార్గాలను ఎదిరించాలి మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నైతికంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలిచారు అక్రమాలు, దౌర్జన్యాలు చేసి గెలిచినా నైతికంగా కూటమి నాయకులు ఓడిపోయారు జగనన్న సైనికులు దాడులను సైతం ఎదుర్కొని ఎన్నికల్లో పోరాటం చేశారు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ప్రతి కార్యకర్తకూ సలాం చేస్తున్నా.. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి
పంచాయతీ ఎన్నికలకు
ఒంగోలు సబర్బన్: వైఎస్సార్ సీపీ శ్రేణులు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకులు మరింత కసిగా, పట్టుదలగా, బాధ్యతగా ప్రతి వార్డు మెంబర్, ప్రతి పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్లు వేయాలన్నారు. కూటమి నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నామినేషన్లు వేసి తీరాలన్నారు. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాము ముందు నిలబడతామని పార్టీ కేడర్‌కు హామీ ఇచ్చారు. పురపాలక, మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ నాయకులు, వారితో అంటకాగిన కొందరు పోలీస్ అధికారులు, ఎన్నికల అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో వారు చేయని దుర్మార్గాలు లేవన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారన్నారు. గడిచిన ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు, కొందరు అధికారులు కొత్త సంస్కృతికి, సంప్రదాయాలకు తెరతీశారని విమర్శించారు. కొత్తరకం మాల్ ప్రాక్టీస్‌లను ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి ఎన్నికల వాతావరణాన్నే కలుషితం చేశారని మండిపడ్డారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్లు చించివేయడం, ఒక వేళ నామినేషన్లు వేసినా.. ప్రచారం చేయనీయకుండా పోలీసులతో బెదిరించడం, అవన్నీ దాటుకుని ఎన్నికలకు వెళితే బూత్ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగులకు పాల్పడటం లాంటివి చేశారన్నారు. చివరకు కౌంటింగ్‌కు వెళితే కరెంటు తీసి బ్యాలెట్ కట్టలు సైతం మార్చారని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. అదేంటని వైఎస్సార్ సీపీ కౌంటింగ్ ఏజెంట్లు మాట్లాడితే పోలీసులతో బయటకు నెట్టేయించారన్నారు. ఒంగోలులో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు గెలిచినా.. టీడీపీ వారికి డిక్లరేషన్లు ఇచ్చారన్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నికల్లో నిజాయితీగా గెలిచేందుకు భయమెందుకని ప్రశ్నించారు. దర్శిలో మరీ దారుణంగా వ్యవహరించారని చెవిరెడ్డి గుర్తు చేశారు. దర్శిలో టెక్నికల్‌గా తాము గెలిచామని కూటమి నాయకులు చెప్పుకుంటున్నా.. నైతికంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గెలిచారన్నారు. ఎన్నికల యుద్ధంలో అన్నిచోట్లా జగనన్న సైనికులే విజయం సాధించారన్నారు. ఎన్నో కుట్రలను ఎదుర్కొని మరీ కొత్తపట్నం జెడ్పీటీసీగా గెలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు 55వ డివిజన్ కార్పొరేటర్ పల్నాటి రవీందర్‌రెడ్డితో పాటు పలువురిని శాలువాలతో చెవిరెడ్డి సన్మానించారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాదరెడ్డి(బన్నీ), కొత్తపట్నం జెడ్పీటీసీ సభ్యుడు లంకపోతు అంజిరెడ్డి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.


