కందుకూరు: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తామని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ సూచించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మున్సిపాలిటీలోని కార్యకర్తలు, నాయకుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కందుకూరులోని పరిస్థితులను తీసుకెళ్లామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కష్టపడి పనిచేశారని, అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొని ఎంపీటీసీలతో పాటు, ఒక జెడ్పీటీసీ స్థానం దక్కించుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారన్నారు. అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారని వివరించారు. దీని కోసం ముందుగా అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని, వార్డులోని అందరు నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏవిధంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టారో గమనించాలన్నారు. ఆ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో బలంగా నిలబడాలని సూచించారు. రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఎక్కడా ఇవ్వవద్దన్నారు. అన్ని రకాల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని కూడా ఉలవపాడు జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకున్నామన్నారు. అలాగే వార్డుల్లో కౌన్సిలర్లు అభ్యర్థులుగా పోటీ చేసే వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చైర్మన్ అభ్యర్థి ఎంపికలో పార్టీ అధిష్టానం సూచనలతో పాటు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారని వివరించారు.
అధికారుల బెదిరింపులకు లొంగవద్దు:
బైండోవర్‌ల పేరుతో అధికారులు, పోలీసులు చేసే బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ నాయకులు గానీ, అభ్యర్థులుగానీ లొంగవద్దని పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అధికారులకు ఆ ఉత్తర్వులు అందజేయవచ్చన్నారు. కాదని ఎవరైనా అధికారులు దౌర్జన్యానికి పాల్పడితే హైకోర్టు, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నామినేషన్‌లు అడ్డుకున్నా, పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడినా వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. పార్టీ శ్రేణులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అభ్యర్థుల ఎంపికపై..
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్‌తోపాటు, పార్టీ పరిశీలకుడు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. వార్డుల వారీగా నాయకులతో చర్చలు జరిపి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాను పరిశీలించి బలమైన అభ్యర్థులను ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. నేటి సాయంత్రానికి చైర్మన్ అభ్యర్థితో పాటు, పెండింగ్‌లో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయనున్నారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి కచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం
అధికార పార్టీ అరాచకాలను
తిప్పికొట్టాలి
వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ బుర్రా
మధుసూదన్‌యాదవ్


