పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

515 పంచాయతీలు, 5,166 వార్డుల్లో ఎన్నికలు కందుకూరు మున్సిపాలిటీకి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం మీడియా సమావేశంలో కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు వెల్లడి

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు తెలిపారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు, డీఆర్‌ఓ పి.వి.రమణ, డీపీఓ అనుపమ, జెడ్పీ సీఈవో చిరంజీవిలతో కలిసి ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ముఖ్య వివరాలు ఇవీ...

జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలోని 27 మండలాల పరిధిలో మొత్తం 519 పంచాయతీలు ఉన్నాయి. అందులో దాసరివారిపాలెం విలీనంతో నికరంగా 518 పంచాయతీలున్నాయి. పదవీ కాలం పూర్తికాని కొండపి, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న మంగమూరు (ఎస్‌.ఎన్‌.పాడు), సర్వేరెడ్డిపాలెం (ఒంగోలు) పంచాయతీలను మినహాయించి 515 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి మొత్తం 5,166 వార్డులకు గాను 5,236 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 10,70,902 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 5,30,738 మంది కాగా మహిళా ఓటర్లు 5,40,138, ఇతరులు 26 మంది ఉన్నారు.

మూడు విడతల్లో పోలింగ్‌:

– మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 8 మండలాల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 26న పోలింగ్‌ జరుగనుంది. ఈ దశలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు మండలాలతో పాటు కొండపి నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించి 139 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకుగాను 1,434 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

– రెండో విడత 10 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వాటిలో అద్దంకి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 198 పంచాయతీలు ఉన్నాయి. అందుకుగాను 2,014 పోలింగ్‌ కేంద్రాలను అధికారులను సిద్ధం చేశారు.

– మూడో విడతలో 9 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. కందుకూరు, ఎస్‌ఎన్‌పాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 178 పంచాయతీలు ఉన్నాయి. అందుకుగాను 1,788 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఈనెల 15 నుంచి 17 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల తిరస్కరణపై ఏమైనా అభ్యంతరాలుంటే 19వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుంది. అనంతరం అదే రోజు మూడు గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 26వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ ఉంటుంది. అనంతరం అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమైతే 27వ తేదీ చేపడతామని కలెక్టర్‌ తెలిపారు.

పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు

ఎస్పీ వి.హర్షవర్దన్‌ రాజు మాట్లాడుతూ 1,280 లొకేషన్లలోని 5,236 పోలింగ్‌ కేంద్రాల్లో 808 సాధారణ, 275 సమస్యాత్మక, 197 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాలని కోరారు.

కలెక్టరేట్లోనూ కందుకూరు మున్సిపల్‌ నామినేషన్లు:

కందుకూరు మున్సిపాలిటీకి ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఇందుకోసం కందుకూరులోని తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణం, పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రాంగణంలో నామినేషన్లు సమర్పించవచ్చన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు కలెక్టరేట్లో కూడా నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీన కందుకూరు మున్సిపాలిటీకి పోలింగ్‌ ఉంటుందన్నారు.

కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్‌

ఈ నెల 14: రిటర్నింగ్‌ అధికారులు/ ఎలక్షన్‌ అధికారులు ఎన్నికల నోటీసు జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ఈ నెల 16: నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ

ఈ నెల 17: నామినేషన్ల పరిశీలన

ఈ నెల 19: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. తుది అభ్యర్థుల జాబితా ప్రకటన

ఈ నెల 26: పోలింగ్‌

ఈ నెల 27: రీపోలింగ్‌

ఈ నెల 30: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement