కూలిన పోలీస్‌స్టేషన్‌ సన్‌షేడ్‌ | - | Sakshi
Sakshi News home page

కూలిన పోలీస్‌స్టేషన్‌ సన్‌షేడ్‌

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

కూలిన పోలీస్‌స్టేషన్‌ సన్‌షేడ్‌ మార్టూరులో ఘోర రోడ్డు ప్రమాదం

సింగరాయకొండ: శిథిలావస్థకు చేరిన స్థానిక పోలీస్‌స్టేషన్‌ భవన సన్‌షేడ్‌ శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు సన్‌షేడ్‌ కింద నిలబడగా, రిసెప్షన్‌ కానిస్టేబుల్‌ గమనించి వారిని పక్కనే ఉన్న కుర్చీల్లో కూర్చోబెట్టారు. వారు అక్కడి నుంచి కదిలిన కొద్దిసేపటికే సన్‌షేడ్‌ కూలిపోయింది. మరో ఐదు నిమిషాలు ఆలస్యమైతే పెద్ద ప్రమాదమే జరిగేదని, త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని ఫిర్యాదుదురాలు ఊపిరిపీల్చుకున్నారు. కాగా శిథిలాలను పోలీసులే తొలగించారు. వర్షానికి ఉరుస్తున్న ఈ భవనానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా ప్రయోజనం లేదని, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు నూతన భవనానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

● లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన

ద్విచక్రవాహనం

● ఇద్దరు యువకులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

మార్టూరు(యద్దనపూడి): బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు వైపు ముగ్గురు యువకులు పల్సర్‌ బైక్‌పై ప్రయాణిస్తున్నారు. ఒంగోలులో బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మార్టూరు మండలం జొన్నతాళి ఫ్‌లై ఓవర్‌ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వద్దిపాడు గ్రామానికి చెందిన శ్రీరామ్‌ పేతురు (27), పుల్లల చెరువు మండలం ఐటీవరం గ్రామానికి చెందిన మంద సాల్మన్‌(20) మృతి చెందగా మరో యువకుడు వేల్పుల నెహేమియా (18) తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుడిని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టుం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పెళ్ళివేడుకకు వెళ్ళి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఇద్దరు యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement