తుఫాన్‌ దెబ్బకు విద్యుత్‌ శాఖకు రూ.20 కోట్ల నష్టం | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ దెబ్బకు విద్యుత్‌ శాఖకు రూ.20 కోట్ల నష్టం

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

కొత్తపట్నంలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు వెల్లడి

కొత్తపట్నం: మురసు తుఫాన్‌ ధాటికి ప్రకాశం జిల్లా విద్యుత్‌ శాఖకు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు వెల్లడించారు. తన 35 ఏళ్ల సర్వీసులో ఇంతటి భారీ నష్టాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఈ నెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వ్యవసాయ విద్యుత్‌ కోసం రోడ్డెక్కిన రైతులు’ కథనానికి ఎస్‌ఈ స్పందించారు. గురువారం ఆయన కొత్తపట్నం సబ్‌స్టేషన్‌ను సందర్శించి మాట్లాడారు. కొత్తపట్నం మండలంలోని 12 అగ్రికల్చర్‌ ఫీడర్లకు 12 ప్రత్యేక బృందాలను కేటాయించి, విరిగిన స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను మార్చి జంపర్లు కలుపుతూ విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నామన్నారు. గృహాలు, ఆక్వా కల్చర్‌, వ్యవసాయ ఫీడర్ల స్థితిగతులపై డీఈ శ్రీకాంత్‌, ఏఈ సురేష్‌లను అడిగి తెలుసుకున్న ఎస్‌ఈ.. అవసరమైన మెటీరియల్‌ను వెంటనే తెప్పించుకోవాలని ఆదేశించారు. వరి, ఆక్వా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంభవించిన నష్టాన్ని వివరించారు. తుఫాన్‌ బీభత్సానికి నాగులుప్పలపాడు మండలంలో అత్యధికంగా 10 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని ఎస్‌ఈ తెలిపారు. అలాగే అద్దంకిలో 3 వేలు, కొత్తపట్నంలో 1,400, ఒంగోలు మండలంలో 800 స్తంభాలు విరిగిపోయాయన్నారు. పనులు చేసేకొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 150 ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయని, మరో 200 ట్రాన్స్‌ఫార్మర్లు మేజర్‌ రిపేర్లకు, 150 ట్రాన్స్‌ఫార్మర్లు మైనర్‌ రిపేర్లకు గురయ్యాయని వివరించారు. ఇప్పటికే 5 వేల కొత్త స్తంభాలు వేసి సరఫరాను పునరుద్ధరించామని, మిగతా పనులను ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ప్రత్యేక నిపుణులు, వర్కర్లను రప్పిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement