ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు – 2026లో భాగంగా రిటర్నింగ్ అధికారులకు గురువారం స్టేజ్–1 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలులోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మూడు దశల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై సమగ్ర శిక్షణ అందించారు. రిటర్నింగ్ అధికారుల విధులు, బాధ్యతలు, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ఎన్నికల గుర్తుల కేటాయింపు, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలతో పాటు ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా వివరించారు. ఎన్నికల ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి అనుపమ, ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ, జిల్లా స్థాయి అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, వివిధ మండలాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.


