చిరు వ్యాపారుల పొట్టకొట్టి.. ఓట్ల కోసం వెంటపడి! | - | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారుల పొట్టకొట్టి.. ఓట్ల కోసం వెంటపడి!

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

రెండున్నరేళ్ల కూటమి పాలనలో నగరంలో ఎటు చూసినా విధ్వంసమే

ఆక్రమణల పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొట్టిన వైనం

ట్రంక్‌ రోడ్డులో కూల్చివేతలను అడ్డుకున్న వ్యాపార వర్గాలు

ముస్లింలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కేటాయించిన ఖబరస్తాన్‌ స్థలాన్ని రద్దు చేసిన కీలక నేత

ఉర్దూ పాఠశాలను కూల్చివేసి నైజం చాటుకున్నాడని ముస్లింల ఆగ్రహం

అభివృద్ధి ముసుగులో చిరువ్యాపారుల ఉపాధిని దెబ్బతీశారు. దుకాణాలను కూల్చి కుటుంబాలను వీధులపాలు చేశారు. ముస్లింల ఖబరస్థాన్‌ స్థలాన్ని రద్దు చేయడంతోపాటు ఉర్దూ పాఠశాలను నేలమట్టం చేశారు. ట్రంకురోడ్డు వ్యాపారులను షాపుల తొలగింపు పేరుతో భయపెట్టారు. ఇలా నగర ప్రజల జీవనాధారాలు, హక్కులపై ప్రభావం చూపిన పాలకులు ఇప్పుడు ఎన్నికల పుణ్యమా అని కొత్త వేషాలతో ఓట్ల కోసం వస్తుండటంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకుల్ని బుల్డోజర్లతో తొక్కేసి, మాయమాటలతో ఓట్ల కోసం వస్తున్నవారికి సరైన బుద్ధి చెబుతామని బాధితులు అంటున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా కేంద్రమైన ఒంగోలులో రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకొని బతికే చిరువ్యాపారులు ఆగమాగమయ్యారు. నగరంలో ఏ మూల చూసినా విధ్వంసం సృష్టించిన పాలకులు సంబరాలు చేసుకున్నారు. కొత్తపట్నం బస్టాండు సెంటర్‌, ఆర్టీసీ కొత్త కూరగాయల మార్కెట్‌ దారి, కూరగాయల మార్కెట్‌, పాలకేంద్రం సెంటర్‌, కొప్పోలులోని ఎఫ్‌సీఐ గోడౌన్‌ పరిసరాల్లో ఆక్రమణల పేరిట బుల్డోజర్లు పంపించి దుకాణాలను, నివాస గృహాలను పడగొట్టేశారు. దీంతో వందలాది చిరువ్యాపారులు రోడ్డున పడ్డారు. నివాస గృహాలను కూల్చివేయడంతో నిరుపేద కుటుంబాలు తలదాచుకునేందుకు చోటు లేక అల్లాడిపోయారు. కర్నూలు రోడ్డులోని పాలకేంద్రం వద్ద ఉన్నపళంగా నివాస గృహాలను కూల్చివేశారు. పొద్దంతా పనులు చేసుకొని నిద్రపోతున్న కూలినాలి జనం తెల్లవారుజామున ఇంటిమీద పడిన బుల్డోజర్ల శబ్దాలతో గుండెలు చేతపట్టుకొని లేచారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు కాళ్లు పట్టుకున్నా విడిచిపెట్టలేదు.

ముస్లిం ఖబరస్థాన్‌ రద్దు చేసిన కీలక నేత...

నగరంలో సుమారు 30 వేల మందికి పైగా ముస్లింలు నివాసముంటున్నారు. వారికి వంద సంవత్సరాల కిందట ఒక ఎకరం స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం జనాభా పెరగడంతో శ్మశాన వాటిక సరిపోవడంలేదు. శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించమని ముస్లింలు అడుగుతున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ముస్లిం కోసం దశరాజుపల్లి కుంట వద్ద రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే జనార్ధన్‌ ఆ స్థలాన్ని రద్దు చేసి కమ్మపాలెం ప్రజల కోసం పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం కలకలం సృష్టించింది. ఆగ్రహానికి గురైన ముస్లింలు నిరసన ర్యాలీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. అయినా సరే ఆ స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్‌లో తీర్మానం చేయించారు. దాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్న పాలకులు ముస్లింలకు ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే అది ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఈ విషయంలో ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారు.

ఉర్దూ స్కూలు విధ్వంసం....

నగరం నడిబొడ్డున బాపూజీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉర్దూ స్కూలు ఉంది. శిథిలావస్థలో ఉన్న దాన్ని పునరుద్ధరించాలని ముస్లింలు కోరుతున్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ స్థలంపై కన్నేసిన కీలక నేత దీన్ని లీజు పేరుతో కాజేసేందుకు కుట్రకు తెరదీశారు. ఇందులో భాగంగా ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్‌ పంపించి కూల్చివేశారు. ఈ విషయం తెలిసిన ముస్లింలు అప్రమత్తమయ్యారు. కూల్చివేసిన ఉర్దూ స్కూలు స్థలాన్ని ముస్లింలకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలు కూడా తీవ్రంగా స్పందించడంతో కీలక నేత కబ్జా కుట్రలకు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అయితే ముస్లింలకు మాత్రం అప్పగించలేదు. దీంతోపాటుగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న షాదీఖానాను మూలన పడేసినట్లు ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మున్సిపల్‌ సిబ్బంది ఉద్యోగాలు

ఊడబెరికి...

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలను తొలగించడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఒంగోలు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పలువురు పారిశుధ్య కార్మికులపై పార్టీల ముద్రలు వేసి తొలగించారు. మేసీ్త్రలపై వేటు వేశారు. ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను పనిదొంగలుగా స్థానిక ఎమ్మెల్యే అభివర్ణించడం ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టిందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల సందర్భంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా పారిశుధ్య కార్మికులకు ఒక్క బోనస్‌ ఇవ్వలేదు. ఒక్క జత దుస్తులు ఇవ్వలేదు. ఒక రోజు చెత్త సేకరణ పేరిట హంగామా చేసిన పాలకులు వారి కష్టాన్ని మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్న విమర్శలు వచ్చాయి.

ట్రంక్‌రోడ్డు విస్తరణ పేరుతో భయపెట్టి..

ట్రంక్‌రోడ్డు విస్తరణ పేరుతో చిన్నవ్యాపారులను భయభ్రాంతులకు గురిచేశారు నగర ప్రజాప్రతినిధి. ప్రస్తుతం 40 అడుగులు ఉండగా, దాన్ని కనీసం 90 అడుగులు విస్తరించాలని యోచించారు. ఇక్కడ ఉన్న సుమారు 250 మంది వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడి నష్టపోతారని ఆందోళన వ్యక్తమైంది. కూల్చివేతలను అడ్డుకున్నారు. విస్తరణకు వ్యాపారస్తులు ససేమిరా అనడంతో తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

పేదల స్థలాలు ఇవ్వకుండా మోకాలడ్డు..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నగరంలోని నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అగ్రహారం, వెంగముక్కలపాలెంలో 280 ఎకరాల భూమిని రూ.200 కోట్లకు కొనుగోలు చేసి ఒక్కొక్కరికి సెంటు చొప్పున నగరంలోని 20,840 వేల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేసింది. ఎన్నికల కోడ్‌ నిబంధనల కారణంగా పట్టాలు పంపిణీ చేయడం కుదరలేదు. దాంతో నాటి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనర్హుల పేరుతో 13 వేల మందిని తొలగించారు. మిగిలిన వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ స్థలాన్ని తమ్ముళ్లకు తాయిలం ఇవ్వాలని కీలక నేత ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కూరగాయల మార్కెట్‌ కూల్చివేతతో రోడ్డున పడిన చిరు వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement